ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా

7 Jan, 2020 04:17 IST|Sakshi

అసెంబ్లీ స్థానాలు 70ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు.. 11న ఫలితాలు: సీఈసీ అరోరా

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు, 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ జనవరి 14వ తేదీన విడుదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) సునీల్‌ అరోరా ప్రకటించారు. సోమవారం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈసారి ఎన్నికలలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీ కాలం ఫిబ్రవరి 22వ తేదీతో ముగియనుంది. ఓటర్ల గుర్తింపు సులువుగా వేగంగా పూర్తయ్యేందుకు అధికారులు అందరికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఓటర్‌ స్లిప్పులను అందజేస్తారు.


13,659 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు, 80 ఏళ్లు పైబడిన పోలింగ్‌ స్టేషన్‌కు రాలేని వారి కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించనున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జార్ఖండ్‌లోని ఏడు నియోజకవర్గాల్లో దేశంలోనే మొదటిసారిగా ఈ వెసులుబాటును కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లోలో తమ పార్టీ రిపోర్టు కార్డుతోనే మరోసారి విజయం సాధించాలని ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ అశిస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విజయాలు, ఆయన సమ్మోహకశక్తి తమ ప్రచారాస్త్రాలని బీజేపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయనుంది. చాన్నాళ్లుగా ఢిల్లీ కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న షీలాదీక్షిత్‌ మరణంతో చతికిలబడ్డ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఇటీవల పార్టీ జార్ఖండ్‌లో సాధించిన విజయం నూతనోత్సాహాన్ని ఇచ్చింది.

ముక్కోణపు పోటీ
2015 ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. నాడు బీజేపీ మూడు సీట్లు గెలవగా, కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. ఈసారి ఎన్నికలలో అరడజను పైగా పార్టీలు తలపడనున్నా ప్రధాన పోటీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే ఉండనుంది. ఈ మూడు పార్టీలు ఢిల్లీలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆప్‌ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుండగా 22 ఏళ్లుగా ఢిల్లీ పీఠానికి దూరమైన బీజేపీ, 15 ఏళ్లు ఢిల్లీని ఏకధాటిగా ఏలినా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్‌.. సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.


మరిన్ని వార్తలు