ఢిల్లీలో పోలింగ్‌ 61%

9 Feb, 2020 03:30 IST|Sakshi
ఓటేశాక సిరా గుర్తు చూపిస్తున్న సీఎం కేజ్రీవాల్‌

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

సీఎం కేజ్రీవాల్‌ నియోజకవర్గంలో స్వల్ప ఓటింగ్‌

ఓటేసిన పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రానికి 61.46% పోలింగ్‌ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్‌ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. కొన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నందున పోలింగ్‌ శాతం పెరిగే చాన్సుందని అధికారులు తెలిపారు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్‌ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్‌ నమోదైంది.  పెట్రోలింగ్, క్విక్‌ రెస్పాన్స్‌ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.


ఓటేసిన రాష్ట్రపతి కోవింద్‌ దంపతులు

పోలింగ్‌ సరళి ఇలా..
పోలింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి మూడు గంటల్లో కేవలం 14.5% మాత్రమే పోలింగ్‌ జరిగింది. ఆ తర్వాత కొద్దిగా పుంజుకుని, మధ్యాహ్నం 3 గంటలకు 41.5%కు చేరుకుంది. పోలింగ్‌ ముగిసే 6 గంటల సమయానికి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ముస్తాఫాబాద్‌లో 66.29%, మతియామహల్‌ 65.62%, సీలాంపూర్‌లో 64.92% పోలింగ్‌ నమోదైంది. షహీన్‌బాగ్‌లాంటి కొన్ని చోట్ల ఓటర్ల క్యూలు కొనసాగుతున్నందున పోలింగ్‌ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఢిల్లీ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి రణ్‌బీర్‌ సింగ్‌ తెలిపారు. వీవీప్యాట్‌ స్లిప్పులో తన ఫొటో, పేరు కనిపించలేదంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ సభర్వాల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే ఆ వీవీప్యాట్‌ మిషన్‌ స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో వీవీప్యాట్‌ వైఫల్యం కేవలం ఒక్క శాతమేనని సీఈవో తెలిపారు. శతాధిక వృద్ధులు 60 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.

ఓటేసిన ప్రముఖులు
రాష్ట్రపతి  కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్‌ సింగ్‌ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రాజ్‌పూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ పోలింగ్‌ కేంద్రంలో తల్లిదండ్రులతోపాటు భార్య సునీత, కొడుకు పుల్కిత్‌తో కలిసి వచ్చి ఓటు వేశారు. ముందుగా ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రియాంకా గాంధీ కొడుకు రెహాన్, కేజ్రీవాల్‌ కొడుకు పుల్కిత్‌ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కేజ్రీవాల్‌ మళ్లీ సీఎం అవుతారని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే ఢిల్లీ సీఎం అవుతారని పుల్కిత్‌ బదులిచ్చాడు.

పోలింగ్‌ కేంద్రం వద్ద సోనియా, ప్రియాంక

కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్విట్టర్‌ వార్‌
ఓటు ఎవరికి వేయాలనే విషయంలో మగవారిని సంప్రదించాలంటూ ఢిల్లీ మహిళలకు ఆప్‌ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇచ్చిన పిలుపుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మీరంతా తప్పకుండా ఓట్లేయండి. ముఖ్యంగా మహిళలకు ఓ విన్నపం. కుటుంబంతోపాటు దేశం, ఢిల్లీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మీ ఇంట్లో మగవారితోనూ చర్చించండి’ అంటూ పోలింగ్‌కు ముందు కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ..ఎవరికి ఓట్లేయాలో తెలియని స్థితిలో మహిళలున్నట్లు కేజ్రీవాల్‌ భావిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కేజ్రీవాల్‌ బదులిస్తూ..ఇంటి బాధ్యతలు మోసే ఢిల్లీ మహిళలు తమ కుటుంబం ఎవరికి ఓటేయాలో కూడా ఈసారి నిర్ణయించారని వ్యాఖ్యానించారు.

షహీన్‌బాగ్‌లో ఆగని నిరసనలు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని షహీన్‌బాగ్‌లో పోలింగ్‌ రోజూ నిరసనలు ఆగలేదు. నిరసనలు కొనసాగేందుకు వీలుగా అందులోని మహిళలు కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన పోలింగ్‌ ప్రక్రియలో తామూ భాగస్వాములయ్యామని నిరసనల్లో పాల్గొంటున్న జెహ్రా షేక్‌ తెలిపారు. బిర్యానీ కోసమే నిరసనల్లో పాల్గొంటున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువు చేసేందుకు ఓట్లు వేశామని మొహమ్మద్‌ అయూబ్‌ అన్నారు. ఏ పార్టీ వారు కూడా తమకు బిర్యానీ సరఫరా చేయడం లేదన్నారు. షహీన్‌బాగ్‌లో నిరసనకారులకు ఢిల్లీ సీఎం బిర్యానీ అందజేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు పంపింది.

సిరా గుర్తుతో ఎంపీ గౌతం గంభీర్‌ దంపతులు.
 


9నెలల పాపతో క్లాసికల్‌ డ్యాన్సర్‌ అరణ్యని


ఓటేసిన 111ఏళ్ల కలితార మండల్‌

మరిన్ని వార్తలు