బీజేపీ సూచనలు పాటిస్తా : కేజ్రీవాల్‌

28 Dec, 2019 19:38 IST|Sakshi

బీజేపీ విమర్శలు స్వీకరిస్తాం : ఆప్‌

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ తనపై చేసిన విమర్శలకు ఆమ్‌ ఆద్మీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కౌంటర్‌ సమాధానమిచ్చారు. బీజేపీ చేసిన ఆరోపణలు, విమర్శల్లో మంచి ఏమైనా ఉంటే వెంటనే స్వీకరిస్తానని అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఢిల్లీ ప్రజలకు సుపరిపాలన అందించామని, ఏమైనా మర్చిపోయి ఉంటే వాటిపై బీజేపీ సలహాల ఇస్తే తప్పక పాటిస్తామని కేజ్రీవాల్‌ తనదైన శైలిలో ప్రకటించారు. కాగా ‘ఆరోప్‌ పత్ర్‌’ పేరుతో కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పిస్తూ బీజేపీ ఓ పత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అనేక హామీలను ఇచ్చిన కేజ్రీవాల్‌ వాటిల్లో కనీసం సగం కూడా పూర్తి చేయలేకపోయారని బీజేపీ మండిపడింది. దీనిపై సీఎం శనివారం స్పందించారు. బీజేపీ సూచనలను తాను స్వాగతిస్తానని అన్నారు. చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తూనే మిగిలిన వాటిని రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

కాగా ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆప్‌ ప్రణాళికలు రచిస్తోంది. వరుసగా 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండి గత ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్‌ కూడా గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా మొత్తం 70 స్థానాల్లో గత ఎన్నికల్లో ఆప్‌ 67 సీట్లను సొంత చేసుకుని చరిత్ర సృష్టించింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆప్‌కు ఈ ఎన్నికలు అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు