ఆయనకు మాత్రమే ఫ్రెష్‌ ఎయిర్‌ కావాలా..!!

11 Nov, 2018 14:15 IST|Sakshi

కుటుంబంతో దుబాయ్‌ పర్యటనలో ముఖ్యమంత్రి

సాక్షి, న్యూఢిల్లీ : మితిమీరిన వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ ఒకవైపు, పక్క రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో వరి దుబ్బును కాల్చడంతో వెలువడే పొగ మరోవైపు దేశ రాజధానికి ఊపిరి సలపనివ్వడం లేదు. కాలుష్య కారకాలు వాతావరణంలో మితిమీరిపోవడం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్యదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విదేశీ పర్యటన చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

గత రెండేళ్లుగా విషవాయువులకు నిలయంగా మారిన ఢిల్లీని పట్టించుకోకుండా వదిలేశారని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి  దుబాయ్‌ వెళ్లారని ఆప్‌ సభ్యుడొకరు చెప్పడంతో.. ‘జనం చస్తూంటే.. ఆయనకు మాత్రం ఫ్రెష్‌ ఎయిర్‌ కావాలా’ అంటూ కేజ్రీవాల్‌పై సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది.

నియమాలున్నాయి.. ఆచరణే కావాలి..!
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు అనేక నియమ నిబంధనలు రూపొందించామనీ, వాటి ఆచరణే సరిగా లేదని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుమితరాయ్‌ చౌదరి వ్యాఖ్యానించారు. కాగా, నగరవ్యాప్తంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఢిల్లీ కాలుష్య నియంత్రణ బోర్డు శనివారం ఆదేశాలు జారీ చేసింది. దుమ్మూధూళి గాల్లో చేరకుండా స్ప్లింకర్లతో నీళ్లు పట్టాలని తెలిపింది.

దీపావళి రోజు టపాసులు పేలలేదు..
బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. కాలుష్య అధికమవడంతో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) పడిపోయి 423గా నమోదవగా.. శనివారం ఈ సంఖ్య 401కి తగ్గడం గమనార్హం. దివాళి రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు