హామీల వలలో ఓటరు ఎటు ?

5 Feb, 2020 03:00 IST|Sakshi

ఉచిత పథకాలు, దేశభక్తి పాఠాలతో ఆప్‌ ముందుకు 

ఎవరి మేనిఫెస్టోలో ఏముంది ?

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం వేరు, ఇచ్చిన హామీలు వేరు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తటస్థ ఓటర్లను ఆకర్షించడానికి ప్రచారాంశాలు దోహద పడతాయి. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే ఎప్పుడైనా అత్యంత కీలకం. ప్రచారంలో జాతీయ భావాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ మేనిఫెస్టో దగ్గరకి వచ్చేసరికి స్థానిక అంశాలకే పెద్ద పీట వేసింది. ప్రచార పర్వంలో వెనుకబడ్డ కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో యువత, మైనార్టీ ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆప్‌  గురువారం మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ చాలా రోజుల కిందటే ఇచ్చిన గ్యారంటీ కార్డులతో పాటుగా దేశభక్తి అంశాన్ని చేర్చింది. 

బీజేపీ: ప్రచారంలో జాతీయ భావం ఎజెండాగా తీసుకొని మాటల తూటాలు పేలుస్తున్న బీజేపీ మేనిఫెస్టోలో స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం పాటిస్తూ తూర్పు ఢిల్లీలో వలస కార్మికులు నివసిస్తున్న కాలనీల అభివృద్ధికి డెవలప్‌మెంట్‌ బోర్డు, ట్యాంకర్లపై ఆధారపడకుండా ఇంటింటికీ రక్షిత మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్లు కేటాయింపు, నిరుపేదలకు రూ.2 కే కిలో గోధుమ పిండి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల రూపాయలు, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వంటి హామీలు ఇచ్చింది. 

కాంగ్రెస్‌: కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ప్రచారంలోనూ, హామీలివ్వడంలో కూడా బీజేపీ, ఆప్‌ కంటే వెనుకబడింది. మైనార్టీల ఓటర్లనే అత్యధికంగా నమ్ముకున్న ఆ పార్టీ తాము అధికారంలోకి వస్తే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. యువ స్వాభిమాన్‌ యోజనకింద నిరుద్యోగులకు రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు భృతి ఇస్తామని తన మేనిఫెస్టోలో వెల్లడించింది. అంతేకాకుండా యువత స్టార్టప్‌లు ప్రారంభించడం కోసం రూ.5 వేల కోట్లు కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. నెలకి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇవ్వనుంది. ఇక ఢిల్లీ వార్షిక బడ్జెట్‌లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది.    

ఆప్‌: యువత, మహిళా సాధికారత దిశగా ఆప్‌ ముందుకు వెళుతోంది. హిందూ ఓట్లు చేజారినా కష్టమేనని భావించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలపై చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. హిందూత్వపై కాస్త సానుకూలంగానే ఉంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్యే మార్గంగా అడుగులు వేస్తున్నారు. ఇది మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీ స్కూళ్లలో దేశభక్తికి సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెడతామన్నారు. తనని అధికార అందలం ఎక్కిస్తాయనుకున్న ఉచిత పథకాల్ని కొనసాగిస్తానంటూ ఇప్పటికే 28 పాయింట్ల గ్యారంటీ కార్డులు ఇచ్చారు. నాణ్యమైన విద్య, నెలకి 200 యూనిట్ల ఉచిత కరెంట్, నెలకి 20 కిలోలీటర్ల ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటి వద్దకే రేషన్, 10 లక్షల మంది సీనియర్‌ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్ర, పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం వంటి హామీలకే మేనిఫెస్టోలో ప్రధానంగా చోటు కల్పించారు. 24 గంటలు మార్కెట్లను తెరిచి ఉంచడాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని కూడా ఆప్‌ హామీ ఇచ్చింది.  

మరిన్ని వార్తలు