కేజ్రీవాల్‌.. ఫిబ్రవరి 14!

12 Feb, 2020 08:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్‌ది ప్రేమ వివాహం.

ఎగ్జిట్‌ పోల్స్‌ నిజం!
ఆప్‌ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్‌ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్‌వర్ష్‌లు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్‌ సర్వే ఆప్‌కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్‌ ఆప్‌కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్‌వర్ష్‌ అంచనాల ప్రకారం ఆప్‌కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది. (చదవండి: ఆప్‌.. మళ్లీ స్వీప్‌)

మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్‌ యూ
ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్‌ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్‌ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్‌ ఆఫ్‌ వర్క్స్‌)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. (చదవండి: ఏ.కే.–62)

మరిన్ని వార్తలు