హస్తిన హ్యాట్రిక్‌ విజేత

21 Jul, 2019 04:23 IST|Sakshi

ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడు సార్లు దక్కించుకున్న విజేత ఆమె. పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి ఢిల్లీ రూపురేఖలను మార్చి నగరం స్థాయిని పెంచిన నాయకురాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి.

81 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం
వయసుతో రాజకీయాలకు పని లేదని నిరూపిస్తూ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ పడుతూ కాంగ్రెస్‌ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారీ చేతిలో ఓటమి పాలైనప్పటికీ 81 ఏళ్ల వయసులో ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. పంజాబ్‌లోని కపుర్తలాలో 1938, మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్‌ సాధించారు. ఆమె భర్త దివంగత వినోద్‌ దీక్షిత్‌ ఐఏఎస్‌ అధికారి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సందీప్‌ దీక్షిత్‌ కాంగ్రెస్‌ సభ్యుడే. కుమార్తె లతికా సయ్యద్‌.

ఆసక్తికరం...షీలా ప్రేమాయణం!
ఢిల్లీ విశ్వద్యాలయంలో చరిత్ర చదివే సమయంలో ïషీలా కపూర్‌కు వినోద్‌ దీక్షిత్‌తో పరిచయమైంది. వినోద్‌ దీక్షిత్‌ కాంగ్రెస్‌ నేత ఉమా శంకర్‌ కొడుకు. వినోద్‌ చురుకైన వాడు, మంచి క్రికెటర్‌ అని ïషీలా తన ఆత్మకథలో రాశారు. ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన షీలా, వినోద్‌ ఆతర్వాత దగ్గరయ్యారు. అయితే, తాను బ్రాహ్మణ కులస్తురాలు కాకపోవడంతో వినోద్‌ తల్లిదండ్రులు పెళ్లికి గట్టిగా అభ్యంతరం చెప్పారని పంజాబీ ఖత్రీ అయిన షీలా తెలిపారు. ఆతర్వాత వినోద్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో తమ పెళ్లికి అడ్డుచెప్పలేదని షీలా పేర్కొన్నారు.

అనూహ్యంగా రాజకీయ ప్రవేశం
షీలా మామ ఉమా శంకర్‌ స్వాతంత్య్ర పోరాటయోధుడు. తర్వాత ఆయన ఇందిర కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎదగడానికి షీలా తెరవెనుక సహకారం అందించారు. ఇందిరాగాంధీని తరచూ కలిసేవారు. షీలాలోని పాలనా నైపుణ్యాన్ని గుర్తించిన ఇందిర ఆమెను ఐక్యరాజ్యసమితిలో మహిళా అంశంపై జరిగే సదస్సుకు భారత్‌ తరఫున ప్రతినిధిగా పంపారు. అదే షీలా రాజకీయ జీవితానికి పునాది వేసింది. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్‌ రాయబారిగా సేవలు అందించారు. రాజీవ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్‌గా అయిదు నెలలు కొనసాగారు.

వివాదాలు, పురస్కారాలు
జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా బెస్ట్‌ చీఫ్‌ మినిస్టర్‌ అవార్డు, 2009లో బెస్ట్‌ పొలిటీషియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎన్డీటీవీ పురస్కారం, అసోచామ్‌ సంస్థ నుంచి ఢిల్లీ వుమెన్‌ ఆఫ్‌ ది డికేడ్‌ అచీవర్స్‌ అవార్డు వంటివి అందుకున్నారు. రూ.3.5 కోట్ల కేంద్ర నిధుల్ని ఆమె తన సొంత రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేశారని బీజేపీ కోర్టుకెక్కింది. 2010లో ఢిల్లీలో కామన్‌వెల్త్‌ క్రీడల్లో వీధి దీపాల సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాగ్‌ వేలెత్తి చూపించింది.

మరిన్ని వార్తలు