ఎలక్షన్‌ ‘బిజినెస్‌’

26 Nov, 2018 03:29 IST|Sakshi

ఎన్నికల వేళ వ్యాపారాలు కళకళ

ఫుడ్డుకు ఫుల్‌ క్రేజ్‌.. 

బార్లు..బీర్ల వ్యాపారం ‘ఫుల్లు’.. 

ట్రావెల్స్‌ గిరాకీ రయ్‌..రయ్‌.. ఫంక్షన్‌ హాళ్లు,కాన్ఫరెన్స్‌ హాళ్లు కిటకిట 

ఇంధనానికి భలే డిమాండ్‌.

ఎన్నికలలో ఎన్ని‘కలలో’..ఓట్ల కోసం ఎన్ని ‘వలలో’ అన్న చందంగా మారింది ఎన్నికల ప్రచారం ట్రెండ్‌. ఇదే అదునుగా మహానగరం పరిధిలో ఎన్నికల వేళ వివిధ రకాల వ్యాపారాలకు గిరాకీ అమాంతం పెరిగింది. బార్లు.. రెస్టారెంట్లు.. ధాబాలు, మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లు...ట్రావెల్స్‌ సంస్థలు, ఫంక్షన్‌హాళ్లు ఒక్కటేమిటి సందట్లో సడేమియాలా..చిన్న చిన్న పండ్లు, పూల వ్యాపారులు, ఇంధనం వ్యాపారానికి సైతం గిరాకీ అమాంతం రెట్టింపైంది. రాజధాని నగరంతోపాటు శివార్లలోనూ పలు వ్యాపారాలు ఎన్నికల తరుణంలో బాగా హిట్టవుతుండడం విశేషం. 

దర్జాగా దాబాలకు...
నగరంలో ప్రధానంగా శంషాబాద్, కొంపల్లి, అంబర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోని దాబాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు, క్యాడర్‌ పోటెత్తుతున్నారు. ఉదయం అల్పాహారం మొదలు మధ్యాహ్నం లంచ్‌..రాత్రి డిన్నర్‌ కోసం వందలాది మంది కార్యకర్తలు ఆయా దాబాలకు తరలివస్తున్నారు. ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైన తరుణంలో వీరికి గిరాకీ  సుమారు 30 శాతం మేర పెరిగినట్లు కొంపల్లిలోని చాందినీ దాబా నిర్వాహకులు విక్రమ్‌ ’సాక్షి’కి తెలిపారు. 
- ఎన్నికల ప్రచారం కోసం వాహనాలకూ విపరీతీమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ట్రావెల్స్‌ నిర్వాహకులకు పంట పండుతోంది. మరోవైపు డీజిల్, పెట్రోల్‌ విక్రయాలు కూడా భారీగా పెరిగాయి.
ఎన్నికల వేళ ఇక మద్యం విషయం మామూలే. లిక్కర్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. సాధారణంగా రోజుకు రూ.10 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతుండగా..ఇటీవల రెట్టింపు స్థాయిలో జరుగుతున్నటు తెలుస్తోంది.
ఎన్నికల పుణ్యమాని ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్స్‌ సైతం అనూహ్యంగా పెరిగాయి. పార్టీల కార్యకలాపాల కోసం  సుమారు వెయ్యికి పైగా ఫంక్షన్‌ హాళ్లు, మినీ కాన్ఫరెన్స్‌ హాళ్లు బుక్‌ అవడం విశేషం.  వీటిల్లోనే వీకెండ్‌ పార్టీలకు ముఖ్య నేతల బర్త్‌డేలు, మ్యారేజ్‌డేల ముసుగు వేస్తున్నారు. 

ఇడ్లీ..దోసె..బిర్యానీ 
ప్రచార పర్వం ఫుడ్డుతోనే ఆరంభమవుతోంది. ఉదయం ప్రచారం ప్రారంభించింది మొదలు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా అలసి సొలిసిన కార్యకర్తల ఆకలిని తీర్చడం ఇప్పుడు అభ్యర్థుల విద్యుక్త ధర్మంగా మారింది. ఉదయం అల్పాహారం..మధ్యాహ్నం బిర్యానీ, పసందైన నాన్‌వెజ్‌ వంటకాలతో విందు భోజనం, సాయంత్రం నూడుల్స్, ఫ్రైడ్‌రైస్‌ వంటి వంటకాలతోపాటు..రాత్రి భోజనానికి వీలైతే బిర్యానీ..నాలుగు కబాబ్‌ ముక్కలతో క్యాడర్‌ కడుపు నింపుతున్నారు. దీంతో చిన్నా పెద్ద రెస్టారెంట్లతో పాటు టిఫిన్‌ సెంటర్లు, మెస్‌లు, తోపుడు బండ్లు సైతం బిజీగా మారాయి.

పండ్లు..పూల గుబాళింపు
ఇక ఇంటింటి ప్రచారం....వెల్లువెత్తిన అభిమానంతో కార్యకర్తలు సమర్పించే పూలదండలు, కురిపిస్తున్న పూలవర్షంతో అభ్యర్థులు తడిసి ముద్దవుతున్నారు. ఇక మహనీయుల పుట్టినరోజులు లేదా తమ పుట్టిన రోజులు, ఇతర ప్రత్యేకమైన రోజుల  సందర్భంగా స్థానికంగా వృద్ధులు, చిన్నారులు, వికలాంగులు, అనాథలకు పండ్ల పంపిణీకి సైతం వివిధ పార్టీల అభ్యర్థులు ప్రాధాన్యతనిస్తుండడంతో పండ్లు, పూల వ్యాపారం కూడా జోరుగానే సాగుతోంది. వీటి ధరలు 20 శాతం,వ్యాపారంం 40 శాతం మేర పెరిగింది.
.:: ఏసిరెడ్డి రంగారెడ్డి 

బరిలో భార్యాభర్తలు.. 
వేర్వేరు నియోజకవర్గాల నుంచి భార్యాభర్తలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. గాదిగూడ మండలం దాబా–కె గ్రామానికి చెందిన కుర్సింగ వసంతరావు, అనిత దంపతులు నవ ప్రజారాజ్యం పార్టీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అనిత ఖానాపూర్‌ నుంచి, వసంతరావు ఆసిఫాబాద్‌ నుంచి బరిలో ఉన్నారు. 
– ఉట్నూర్, ఆసిఫాబాద్‌ జిల్లా

సిర్పూర్‌లో మామ–అల్లుడు 
ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ బరిలో మామ..అల్లుడు పోటీకి దిగారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మామ అయితే, రావి శ్రీనివాస్‌ ఆయనకు మేనల్లుడు. కోనప్ప టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తుండగా...శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బీఎస్పీ నుంచి పోటీకి దిగారు.  కోనప్ప 2014లో కాంగ్రెస్‌ టికెట్‌ రాక బీఎస్పీ నుంచి గెలిచారు.
– కాగజ్‌నగర్‌ 

ఇద్దరిదీ ఒకటే ‘పంచాయతీ’ 
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు నుంచి పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులది ఒకే గ్రామ పంచాయతీ కావడం విశేషం. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చందూలాల్‌ స్వగ్రామం ములుగు మండలంలోని జగ్గన్నపేట పంచాయతీ పరిధి సారంగపల్లి. కాంగ్రెస్‌ అభ్యర్థి ధనసరి అనసూయ(సీతక్క)ది కూడా జగ్గన్నపేట. ఈ స్థానం ఎస్టీ రిజర్వ్‌ అయింది. 
– ములుగు  

మరిన్ని వార్తలు