అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం

11 Apr, 2020 12:54 IST|Sakshi
పీ చిదంబరం ( ఫైల్ ఫోటో )

ముఖ్యమంత్రులకు మాజీ ఆర్థికమంత్రి సూచన

వెంటనే పేద కుటుంబాలకు నగదు బదిలీ అమలు కావాలి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కల్లోలం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రాల ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం స్పందించారు. లాక్‌డౌన్ వల్ల  గత 18 రోజులలో ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన పేదలను ఆదుకోవాల్సిందిగా కోరాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభంతో దాచుకున్న కొద్దిపాటి సొమ్ము కూడా అయిపోయి, ఆకలితో అలమటిస్తూ పలువురు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తక్షణమే ప్రతి పేద కుటుంబానికి నగదును బదిలీ చేయాల్సిందిగా కోరాలని ముఖ్యమంత్రులకు  సూచించారు. ఇందుకు 65,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, ఇది పెద్ద భారం కాదని మాజీ ఆర్థికమంత్రి  పేర్కొన్నారు. శనివారం వరుస ట్వీట్లలో చిదంబరం ఈ సూచనలు చేశారు. 

పేద ప్రజల జీవితాలు కూడా ముఖ్యమైనవని ఈ రోజు ప్రధానమంత్రికి చెప్పాలని ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్,అశోక్ గెహ్లోట్, భూపేష్ భాగెల్, వి నారాయణసామి, ఉద్దవ్ ఠాక్రే , పళనిస్వామిలను  ఉద్దేశించిన చిదంబరం ట్వీట్ చేశారు.   కోవిడ్-19 (కరోనా వైరస్‌) పై పోరాడుతున్నట్టుగానే, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పేదలు ఉపాధి కోల్పోయారు, వారు ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని చిదంబరం ప్రశ్నించారు. పేదల సంక్షేమమే ఏకైక డిమాండ్ గా వుండాలని ఆయన ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల  లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అయితే పెరుగుతున్న కేసుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 15వ తేదీ ఎత్తివేయాలా  లేదా అనే విషయంపై ముఖ్యమంత్రులతో ప్రధాని శనివారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అయితే  మరో రెండు వారాల పాటు  లాక్‌డౌన్‌ పొడిగింపునకే  పలు సీఎంలు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీ వరకూ  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.  (అతిచౌక ధరలో ఐఫోన్)

>
మరిన్ని వార్తలు