వాగ్వాదాలు.. నిరసనలు

6 Feb, 2019 06:13 IST|Sakshi
లోక్‌సభ నుంచి వెళ్లిపోతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు

పార్లమెంటు ఉభయ సభల్లో అంతరాయం

మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్‌ వాకౌట్‌

న్యూఢిల్లీ: సీబీఐ వివాదంపై మంగళవారం కూడా పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా విపక్షాల నిరసనలతో రాజ్యసభ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరపాలని లోక్‌సభలో అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో ఇరు పక్షాల నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధంతో సభ మూడుసార్లు వాయిదాపడింది.

ప్రధాన ప్రతిపక్షమైన తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఒకవైపు, ఇలా గందరగోళం కొనసాగుతుండగా స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ పదేపదే విజ్ఞప్తులు చేసినప్పటికీ తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు వెల్‌లో నినాదాలు కొనసాగించారు. ‘అవినీతి– సంఘ వ్యతిరేక శక్తులు’ ఏకమై ప్రధాని మోదీకి  వ్యతిరేకంగా ఏకమయ్యాయంటూ బీజేపీకి చెందిన హకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించగానే ప్రతిపక్ష సభ్యులంతా లేచి నిలబడి ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ పట్టుబట్టారు.

ఇదే సమయంలో అపురూప పొద్దార్‌ (టీఎంసీ), వీణా దేవి(ఎల్‌జేపీ)లు పరస్పరం బెదిరించుకుంటూ సైగలు చేసుకోవడంతో మిగతా సభ్యులు జోక్యం చేసుకుని వారిని వారించారు. రాజ్యసభలో.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపట్టాలని అధికార పక్షం పట్టుబట్టగా సీబీఐని ప్రభుత్వం వాడుకోవడంపై చర్చించాలంటూ టీఎంసీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు నినాదాలతో అంతరాయం కలిగించారు. దీంతో డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సభను బుధవారానికి వాయిదా వేశారు.

రైతుల స్థితిగతులపై దేశవ్యాప్త సర్వే
న్యూఢిల్లీ: రైతుల స్థితిగతుల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేపట్టనుంది. ఈ ఏడాది పంట కాలంలో రైతుల ఆదాయం, వ్యయం, రుణాలు తదితర వివరాలు సేకరించనుంది. వ్యవసాయదారుల పరిస్థితిపై 77వ రౌండ్‌ నేషనల్‌ శాంపుల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) కాలంలో ఆధ్యయనం నిర్వహించనున్నట్లు మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేను చివరిసారిగా ఎన్‌ఎస్‌ఎస్‌వో 2012–2013 పంట కాలానికి చేపట్టింది.

కాబట్టి 2014–2018 మధ్య కాలంలో రైతుల స్థితిగతుల వివరాలు అందుబాటులో లేవని లోక్‌సభకు గజేంద్ర సింగ్‌ తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా, వనరుల, ఉద్యోగుల లభ్యత తదితర అంశాలను బట్టి ఈ సర్వే కాల వ్యవధి ఉంటుందని చెప్పారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 70వ రౌండ్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ అధ్యయనం డేటా వివరాలను లెక్కలోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు