రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునర్‌ నిర్మిస్తాం 

13 Jun, 2018 01:45 IST|Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం  

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజా స్వామ్యాన్ని పునర్‌ నిర్మిస్తామని తెలంగాణ జనసమితి పార్టీ (టీజేఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం తో పాటు మక్తల్, మాగనూరు మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల జెండాలు ఆవిష్కరించడంతో పాటు భూ ప్రక్షాళన సందర్భంగా రికార్డుల్లో తప్పులు దొర్లిన రైతులతో మాట్లాడారు.

రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉందని, కానీ పార్టీలు ఎందుకు పెడుతున్నారని అడిగే హక్కు ఎవరికీ లేదన్నారు. అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చేలా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. రాష్ట్రంలో రాజకీయ ఐక్యత అవసరమని భావిస్తే అన్ని పార్టీలను ఏకం చేస్తామన్నారు. రైతుబంధు చెక్కుల పంపిణీలో చాలా మంది నష్టపోయారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు, రైతులకు కలిగిన ఇబ్బందులపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు