నోట్లరద్దు: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు!

18 Apr, 2018 14:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏడాదిన్నర క్రితం పెద్ద నోట్ల రద్దుతో పడరాని పాట్లు పడ్డాం. మళ్లీ అదే పరిస్థితి దాపురించింది. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు నోక్యాష్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నగదుకు కొరత ఉందని ముందుగా దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్‌ చంద్ర గార్గ్‌ అంగీకరించారు. ఈ సమస్య తాత్కాలికమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని ఆర్థికశాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా అన్నారు. ఐదు నుంచి ఏడు రోజుల్లో పరిస్థితిని చక్కదిద్దుతామని బ్యాంకింగ్‌ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

ఈ సమస్యను సత్వరం పరిష్కరించేందుకు కేంద్రం రాష్ట్రాల వారీగా కమిటీలను వేయగా, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అంతర్రాష్ట కమిటీని వేసింది. ఐదు వందల రూపాయల నోట్ల ముద్రణను ఐదింతలు పెంచాక కూడా నోట్ల కొరత ఎందుకుంటుందని ఆర్‌బీఐ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. నోట్ల కొరత ప్రమాదం ఉందంటూ ఫిబ్రవరి నెలలో వచ్చిన వార్తలను పట్టించుకోకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ పరిస్థితి దాపురించిందని అర్థం అవుతుంది. తమకు నోట్ల కొరత ఎక్కువగా ఉందంటూ ఫిబ్రవరి నెలలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నగదు ప్రవాహాన్ని అడ్డుకుంటోందంటూ విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. డిజిటల్‌ లావాదేవీలు పెంచడానికే నగదును అడ్డుకుంటున్నారన్నది వారి వాదన. కుట్రపూరితంగా చెలామణి నుంచి రెండు వేల రూపాయల నోట్లు మాయం అవుతున్నాయని మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఆరోపించారు. అయినా ప్రభుత్వం నుంచి, ఆర్బీఐ నుంచి నివారణ చర్యలు లుప్తం. ప్రధాని నరేంద్ర మోదీ ‘అచ్చేదిన్‌’ వస్తాయంటూ తన మానాన తాను చెప్పుకుంటూ పోతుంటే దేశంలో నిత్యం నీరవ్‌ మోదీ స్కామ్‌లు, కథువా, ఉన్నావో కేసులు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు