చిత్తు చిత్తుగా ఓడిన చింతమనేని

23 May, 2019 16:01 IST|Sakshi

సాక్షి, ఏలూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు. దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్‌ తగిలింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం గట్టిన నియోజకవర్గ ప్రజలు ఓటు హక్కు ద్వారా చింతమనేనికి తగిన బుద్ధి చెప్పారు. చింతమనేనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం సాధించారు. 

మహిళలను తూలనాడుతూ.. దాడులు చేస్తూ దుశ్సాసనుడిని మరిపించిన చింతమనేని ప్రభాకర్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి బరిలోకి  చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆయనకు ఓటర్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది.

తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై  దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు కౌంటింగ్‌కు ముందే స్పష్టమైంది. 

మరిన్ని వార్తలు