యోగి హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ

4 Feb, 2019 04:02 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌ సభలకు రాకుండా అడ్డుకున్న ప్రభుత్వం

బలూర్ఘాట్‌/లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పశ్చిమబెంగాల్‌లో చుక్కెదురైంది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆదివారం బీజేపీ చేపట్టిన రెండు సభలకు సీఎం యోగి హాజరు కాలేకపోయారు. అందుకు బదులుగా ఫోన్‌ ద్వారా ఆయన రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో సత్తా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ‘గణతంత్ర బచావో’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లా బలూర్ఘాట్, ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లా రాయ్‌గంజ్‌లో నిర్వహించే సభలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆదిత్యనాథ్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ఈ రెండు చోట్లా మమతా బెనర్జీ రాష్ట్ర యంత్రాంగం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన లక్నో నుంచే ఫోన్‌ ద్వారా ఈ రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మరిన్ని వార్తలు