కమలానికి యూపీ దెబ్బ?

14 May, 2019 05:48 IST|Sakshi

సార్వత్రిక ఎన్నికల సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసింది. అధికార పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గనుందన్న సరికొత్త ఆంచనాలు కమలనాథుల్లో ఎంతో కొంత గుబులు రేపుతున్నాయి. ఆంబిట్‌ కేపిటల్‌ అనే ఓ బ్రోకరేజీ సంస్థ చేసిన ఒక సర్వే ప్రకారం బీజేపీ ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 50 సీట్లు కోల్పోనుంది. దేశం మొత్తమ్మీది 543 సీట్లలో అధికార పార్టీ గెలుచుకోగల స్థానాలు 210 పదికి మించవని క్షేత్రస్థాయిలో తాము చేసిన సర్వే తెలుపుతోందని ఆంబిట్‌ కేపిటల్‌ బిజినెస్‌ స్టాండర్డ్‌లో ఒక కథనం ప్రచురితమైంది. వివరాలు...

గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలతో తాము ఒక సర్వే నిర్వహించామని.. దాని ప్రకారం నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికల్లో 220 – 240 సీట్లు రావచ్చునని తేలింది. ఆంబిట్‌ కేపిటల్‌కు చెందిన రితిక మన్‌కర్‌ ముఖర్జీ, సుమీత్‌ శేఖర్‌లు ఈ సర్వే నిర్వహించారు. మరోసారి అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలకు ఉత్తర ప్రదేశ్‌ ఫలితాలు గండికొట్టవచ్చునని.. 2014లో గెలుచుకున్న 71 స్థానాల్లో గరిష్టంగా 35 మాత్రమే దక్కుతాయని వీరు అంటున్నారు.
బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌లతో ఏర్పాటైన మహాగఠబంధన్‌ ప్రభావం బీజేపీపై ఉండనుందని వీరు చెబుతున్నారు. ఈ అంచనాలే నిజమైతే.. ఫలితాల తరువాత బీజేపీ కనీసం నాలుగు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిన పరిస్థితి ఉండనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ.. బీఎస్పీ జట్టు కట్టినా ఆశ్చర్యం లేదన్నది ఆంబిట్‌ అంచనా. బీజేపీ అభ్యర్థులు నేరుగా అఖిలేష్‌ను మాత్రమే విమర్శిస్తూండటం.. మాయావతిపై పెద్దగా విమర్శలు చేయకపోవడాన్ని భవిష్యత్‌ పరిణామాలకు సూచికగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అంటున్నారు.

2014 ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే బీఎస్పీ మూడో అతిపెద్ద జాతీయ పార్టీ. అప్పట్లో తగినన్ని సీట్లు రాకపోయినా.. ఈ సారి ఎస్పీతో జట్టు కట్టిన ఫలితంగా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముంది. గత ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసినప్పుడు బీఎస్పీ, ఎస్పీల కూటమికి యూపీలో 45 శాతం ఓట్లు రావచ్చునని, బీజేపీ ఓట్ల శాతం 34.2 వరకూ ఉండవచ్చునని వివరించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొనడం, పశువధశాలపై నిషేధం తమ ఉపాధికి గండికొట్టిందని ఒక వర్గం వారు భావిస్తూండటం దీనికి కారణం. నగరాలకు హిందూ పేర్లు పెట్టడం కూడా ఓటర్లకు నచ్చడం లేదని ఆంబిట్‌ అంటోంది.  

మరిన్ని వార్తలు