చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు

17 Nov, 2019 12:28 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణా ద్వారా నారా లోకేష్‌కు ముడుపులు చెల్లించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం జానంపేట వద్ద ఇసుక స్టాక్‌ యార్డ్‌ను ఆదివారం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుతో కలిసి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇసుక కొరతను అధిగమించామన్నారు. గత పాలనలో ఇసుకను దోచుకొని ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్న పార్టీ దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇసుక దీక్ష చేసిందని దుయ్యబట్టారు.

ప్రజలు మీరు చేసిన దొంగ దీక్షను గమనించి తిప్పికొట్టారని ఎద్దేవా చేశారు. చింతమనేని వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చింతమనేనిపై నమోదయిన కేసులు అన్నీ అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నమోదైన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వాటి దర్యాప్తు ఆధారంగానే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారే తప్ప కొత్తగా మేము ఏ కేసులు పెట్టలేదని తెలిపారు. చింతమనేని తన కేసులకు సంబంధించి అన్ని విషయాలు చంద్రబాబును అడిగితే బాగుంటుందని వెల్లడించారు.

అలాగే మీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న వనజాక్షిపై దాడి జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయంలోనే సెటిల్ చేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో అడ్డగోలుగా ఇసుక రవాణా జరిగినా నోరు మెదపని పవన్‌ కల్యాణ్‌ వైజాగ్‌లో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చంద్రబాబుతో కలిసి అడ్డుకోవద్దని ఆయన హితవు పలికారు. ఈ మేరకు భవిష్యత్తులో ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు