నిరంకుశ పాలనకు త్వరలో చరమ గీతం’

31 Mar, 2018 11:14 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి

సీఎం స్వప్రయోజనాల కోసం ‘హోదా’ తాకట్టు

శాసన వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి

 ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామా

 మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి

మదనపల్లె అర్బన్‌: శాసన వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిరంకుశ పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి  నేతృత్వంలో త్వరలో చరమగీతం పాడతామని ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం స్థానిక వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం వద్ద హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీకి బీజేపీతో లాలూచీ పడిన చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత మేల్కోవడం విడ్డూరమన్నారు. హోదా పేరెత్తితే కేసులు పెడతామని సీఎం హెచ్చరించడమే దీనికి నిదర్శనమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఏప్రిల్‌ ఆరో తేదీన తమ పదవులకు రాజీనామా చేస్తారని పేర్కొన్నారు.

రేపు నియోజకవర్గంలో ఎంపీ..
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆదివారం మదనపల్లె నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా తురకపల్లెలో అంగన్‌వాడీ కేంద్రం, పుంగనూరువాండ్లపల్లెలో సీసీరోడ్డు, అమ్మచెరువుమిట్టలో కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. శ్మశానవాటిక, టిప్పుసుల్తాన్‌ జామీయా మసీద్‌ ప్రహరీ గోడల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం బసినికొండలో ముస్లింలతో సమావేశమవుతారని చెప్పారు. అనంతరం రామసముద్రం మండలం గొల్లపల్లెలో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం దిన్నెపల్లె, రామసముద్రంలో బసెషెల్టర్‌లను ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో నాయకులు జింకా వెంకటాచలపతి, అంకిశెట్టిపల్లె సర్పంచ్‌ శరత్‌రెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, రఫీ, కార్మిక విభాగం షరీఫ్, క్రిష్ణమూర్తి, రూరల్‌ కన్వీనర్‌ మహేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు