అనుభవమున్నా.. ఈ సారి ఆయనది తప్పే

30 Sep, 2017 18:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్ర మాజీ  ఆర్థికమంత్రి యశ్వంత్‌ సిన్హా చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. కొందరు సిన్హాను సమర్థిస్తుంటే.. మరికొందరు ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, సిన్హా వ్యాఖ్యలపై స్పందించారు. ఆర్థిక వ్యవస్థపై అనుభవమున్నప్పటికీ, యశ్వంత్‌ సిన్హా దేశీయ ఎకానమీని ఈసారి సరిగ్గా అంచనా వేయలేకపోయారని నఖ్వీ పేర్కొన్నారు. గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అమలు తర్వాత, నిత్యావసరాల వస్తువుల ధరలు కిందకి దిగొచ్చాయని పేర్కొన్నారు. యశ్వంత్‌ సిన్హాకు అనుభవముంది, కానీ ఈ సారి సరిగ్గా ఆర్థిక వ్యవస్థను అంచనావేయలేకపోయారు. కొత్త, పాత భారత్‌ల మధ్య భేదం ఉందని, ప్రస్తుతం మనదేశం సానుకూల దిశగా పయనిస్తుందని జీ మీడియా రీజనల్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలోనే మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కూడా నఖ్వీ విమర్శించారు. స్వేచ్ఛాయుత భారత ఆర్థిక వ్యవస్థను, ఆయన తనాఖా పెట్టారని మండిపడ్డారు. 2016 నవంబర్‌ నుంచి 2017 జూలై మధ్యలో డీమానిటైజేషన్‌, జీఎస్టీలను అమలు చేయడం సరియైనది కాదని సిన్హా చేసిన వ్యాఖ్యలను నఖ్వీ తిప్పి కొట్టారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోనూ ప్రభుత్వాలను ఏర్పాటుచేసేందుకు బీజేపీకి మంచి రాజకీయ సత్తా ఉందని నఖ్వీ చెప్పారు. 2017 చివర్లో లేదా 2018 మొదట్లో గుజరాత్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల కమిషన్‌ దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.  

మరిన్ని వార్తలు