స్వపక్షంలో విపక్షం

25 Sep, 2017 11:37 IST|Sakshi

అధికారపార్టీ జోక్యంతో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

ప్రణాళిక కమిటీ సమావేశంలో నిలదీసిన అధికార పార్టీ జెడ్పీసభ్యుడు 

రాయగడ(ఒడిశా): జిల్లాలో ప్రతి అభివృద్ధి పనిలో అధికారపార్టీ నాయకుల జోక్యంతో అవినీతి పెరిగిపోతోంది. ప్రతి ఒక్క సంఘటనలో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకుని శాంతిభద్రతలకు సంపూర్ణంగా విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు కలుగచేసుకోవాలని రాయగడ జిల్లా పరిషత్‌ సభ్యుడు అధికార పార్టీకి చెందిన  పట్నాన గౌరీశంకర్‌ నిలదీశారు.  జిల్లా అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా లాల్‌బిహారీ హిమరికను నియమించిన తరువాత రాయగడ డీఆర్‌డీఏ కాన్ఫరెన్స్‌ సమావేశ భవనంలో  ఆయన అధ్యక్షతన తొలి సమావేశాన్ని(16వ జిల్లా ప్రణాళిక కమిటీ) శనివారం నిర్వహించారు.  గోపబంధు గ్రామీణ యోజన 2017–18 యాక్షన్‌ ప్లాన్‌ ఆమోదానికి  సంబంధిత కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ప్రజాప్రతినిధుల చర్చలు, సమస్యలు, వివరించే సమయంలో బీజేడీకి చెందిన జెడ్పీ సభ్యుడు మాట్లాడుతూ భారీపరిశ్రమల్లో అధికార పార్టీ నాయకులు కలుగచేసుకోవడం వల్ల జిల్లాలో వేదాంత అల్యుమిన, ఇంఫా, పరి శ్ర మ, జేకే పరిశ్రమ, ఉత్కళ అల్యుమిన పరిశ్రమల్లో జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నిరుద్యోగికీ  ఉద్యోగావకాశం లభించడం లేదని వాపోయారు.  ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగావకాశాలు కల్పించగా ఈ జిల్లాలో యువత నిరుద్యోగులుగా మారి స మాజంలో సంఘవిద్రోహలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒత్తిళ్లకు అధికారులు  లొంగొద్దు
జిల్లాలో దాదాగిరి, గుండాయిజం, దౌర్జన్యాలు, పెరిగిపోయాయి. జిల్లా అధికారులు అధికారపార్టీ నాయకుల ఒత్తిడికి లొంగకూడదు. పోలీస్‌ వ్యవస్థను పటిష్టం చేసి రాజకీయ ఒత్తిడి లేకుండా అధికారులు విధులను నిర్వహిస్తూ జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నేరుగా అధికారపార్టీ నాయకులను ఉద్దేశించి ఆవేదన వెలిబుచ్చారు.  

సబ్సిడీలు అందుకుని మూసివేత 
చిన్నతరహా పరిశ్రమలకు ప్రభుత్వం రుణాలు, సబ్సిడీలు ఇస్తుండగా ఏ ఒక్క చిన్న తరహా పరిశ్రమలో కూడా స్థానిక విద్యార్థులకు ఉద్యోగావకాశం కల్పించలేదని సబ్సిడీ అందిన పిదప   పరిశ్రమలను మూసివేస్తున్నారని గౌరీశంకర్‌ ఆరోపించారు. కంపెనీలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోందని కూలీలు, కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి పనిచేయిస్తున్నారని స్థానికులకు అవకాశం కల్పించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేపట్టే అభివృద్ధి పథకాలు తక్కువ రోజుల్లో  కూలిపోతున్నాయని జిల్లా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు  తలవంచకుండా పనిచేయాలని అభ్యర్థించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న అధికారపార్టీ రాజకీయ నాయకుల ముఖాలు కళావిహీనంగా మారాయి.

మరిన్ని వార్తలు