రాజ్యసభ బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ

8 Jun, 2020 14:30 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (87) నిలుస్తున్నారని జేడీఎస్‌ ప్రకటించింది. పార్టీ ఎమ్మెల్యేలతో సహా, మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీ పెద్దల విజ్ఞప్తి మేరకు పోటీ చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు జేడీఎస్‌ చీఫ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ట్విటర్‌ వేదికగా సోమవారం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ మద్దతులో రాజ్యసభ పోరులో దిగనున్నారని తెలిపారు. మంగళవారం నామినేషన్‌​ పత్రాలను దాఖలు చేస్తారని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. (ఉత్కంఠగా రాజ్యసభ పోరు)

మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో ఒక్కో సభ్యుడిని గెలిపించుకునేందుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ప్రస్తుతం జేడీఎస్‌కు 34 మంది సభ్యుల మద్దతు ఉంది. తమ అభ్యర్థిని గెలిచేందుకు మరో 10 స్థానాలకు దూరంగా ఉంది. ఇక సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు 68 మంది సభ్యులు ఉన్నారు. ఓ సభ్యుని గెలిపించుని, మిగిలిన వారిని దేవెగౌడ్‌కు మద్దతు తెలిపేలా ఇరుపార్టీల నేతలు సంప్రదింపులు జరిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దేవెగౌడ మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తొలిసారి ఆయన 1996లో పెద్దల సభకు ఎన్నికయ్యారు. (రిసార్ట్‌కు గుజరాత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు)

కాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గేను అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇక​ అధికార బీజేపీకి సభలో 117 మంది సభ్యులు మద్దతుతో సునాయాసంగా ఇద్దరు సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం ఉంది. ఈ రెండు స్థానాల కోసం విపరీతమైన పోటీ నడుమ బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ సీనియర్‌ నేతలు అశోక్ గస్తీ, ఎరన్న కాదడిలను రాజ్యసభ అభ్యర్థులకు ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సోమవారం ప్రకటించారు. మరోవైపు నాలుగు స్థానాలకు జరిగే ఎన్నికలకు మంగళవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈనెల 10న నామినేషన్ల పరిశీలన, 12 వరకు ఉపసంహరణ గడువు ఉంది. 


 

మరిన్ని వార్తలు