నేను అలా అనలేదు : దేవెగౌడ

21 Jun, 2019 15:11 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ బాంబు పేల్చిన జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ తన వ్యాఖ్యలపై యూటర్న్‌ తీసుకున్నారు. తాను మాట్లాడింది అసెంబ్లీ ఎన్నికల గురించి కాదని, స్థానిక ఎన్నికల గురించి మాత్రమేనని స్పష్టతనిచ్చారు. తాను ఉన్నది కేవలం జేడీఎస్‌ను బలోపేతం చేసేందుకేనని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఢోకా లేదని, నాలుగేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌- జేడీఎస్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. కాగా తన తనయుడు కుమారస్వామి సీఎంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్‌ పెత్తనం చెలాయిస్తుందని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు కలిసి ఉంటామని చెప్పి..ప్రస్తుతం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఈ క్రమంలో దేవెగౌడ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి ఘోర పరాభవం చెందడం, బీజేపీ ఆపరేషన్‌ కమలానికి తెరతీసిందంటూ వార్తలు వెలువడటంతో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తమకు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ వర్గాల్లో లుకలుకలు మొదలయ్యాయి. ఓటమిపై ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దేవెగౌడ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి నష్టనివారణ చర్యలు చేపట్టారు. తన తండ్రి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడితే.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

చదవండి : నా కొడుకు సీఎం కావాలని కోరుకోలేదు : దేవేగౌడ

మరిన్ని వార్తలు