అహంకారంతో వ్యవహరించారు

4 Nov, 2018 02:17 IST|Sakshi

     రాజకీయాల్ని వదిలి జీవితాన్ని సార్థకం చేసుకోండి

     కేసీఆర్‌కు దేవేందర్‌గౌడ్‌ బహిరంగలేఖ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు భిన్నంగా తొలిరోజు నుంచీ కేసీఆర్‌ పాలన సాగిందని, అనుభవరాహిత్యం, నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని మరుగునపడేసేలా ఆయన పాలించారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.దేవేందర్‌గౌడ్‌ ఆరోపించారు. అధికారం అనేది ప్రజలకు సేవచేసే అవకాశం అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయిన కేసీఆర్‌ వ్యవహారశైలిని చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరిక వ్యవస్థలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని ఆయన విమర్శించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శనివారం దేవేందర్‌గౌడ్‌ బహిరంగలేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రం నూతన శకంలోకి అడుగుపెట్టే చారిత్రక సందర్భం ముందు నిలిచినా, ఆయన అహంకారంతో బంగారం లాంటి అవకాశాలను కాలదన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజలపై ఎలాంటి భారం మోపకుండానే రాష్ట్రంలో ఏటా 20శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారని దేవేందర్‌గౌడ్‌ లేఖలో అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు వ్యక్తిగతంగా ఎటువంటి వ్యతిరేకతా లేదని, 65 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన రాజకీయాల్ని వదిలి మిగిలిన జీవితాన్ని సార్థకత చేసుకోవాలని ఓ మిత్రునిగా సలహా ఇస్తున్నట్టు లేఖలో తెలిపారు. యువతరానికి అవకాశం ఇస్తే నూతన ఆలోచనలతో సమాజాన్ని తీర్చిదిద్దుతారని కేసీఆర్‌కు రాసిన లేఖలో దేవేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు