‘మళ్లీ నేనే ముఖ్యమంత్రిని...ఎనీ డౌట్‌?’

21 Sep, 2019 16:40 IST|Sakshi

ముంబై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసే పోటీ చేస్తాయని.. మరోసారి తానే ముఖ్యమంత్రిని అవుతానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఎన్నికల సంఘం శనివారం మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిత్రపక్షం శివసేన సమాన సంఖ్యలో సీట్లు డిమాండ్‌ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. అవన్ని అవాస్తవాలే అని.. సీట్ల పంపకం గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ లోపు ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం గూర్చి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

గడిచిన ఐదేళ్లలో శివసేన మంత్రుల సహకారంతోనే తన కేబినేట్‌ నిర్ణయాలు తీసుకుందన్నారు ఫడ్నవిస్‌. అంతేకాక ఈ ఐదేళ్లలో ఏ శివసేన మంత్రి కూడా తన కేబినేట్‌ నిర్ణయాలను వ్యతిరేకించలేదని.. ఏ నిర్ణయం గురించి కూడా పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి రాలేదన్నారు. మరో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా అని ప్రశ్నించగా.. అందులో ఎలాంటి సందేహం లేదని ఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఫడ్నవిస్‌ స్పందిస్తూ.. తాను సామ్నా చదవను అన్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన ఒంటరిగా పోటీ చేశాయి. అయితే బీజేపీ 122 స్థానాల్లో గెలుపొంది మెజారిటీ సీట్లు సాధించిన పార్టీగా నిలవగా.. శివసేన కేవలం 63 స్థానాలకే పరిమితమయ్యింది. అనంతరం రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 27న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబరు 21న పోలింగ్‌.. 24న కౌంటింగ్‌ ఉంటుంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా