‘ఫడ్నవీస్‌వి చిన్న పిల్లల తరహా ఆరోపణలు’

1 Dec, 2019 16:31 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ చిన్న పిల్లల తరహా ఆరోపణలు చేస్తున్నారని శివసేన ముఖ్యనేత రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. సంజయ్‌ రౌత్‌ శివసేన పత్రిక సామ్నాలో రొహతక్‌ కాలమ్‌లో కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, శివసేన కూటమిని ప్రస్తావించారు. ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని కూటమిని మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం స్వాగతించిందని తెలిపారు. శక్తివంతమైన  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా త్రయాన్ని ఢీకొట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

మా కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు కొనసాగుతుందని సంజయ్‌ రౌత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షమే లేదంటూ ఫడ్నవీస్‌ అతివిశ్వాసం ప్రదర్శించారని సంజయ్‌ రౌత్‌ ఎద్దేవా చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ చొరవతోనే  కూటమి సాధ్యమయిందని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో విభేదాల గురించి రౌత్ స్పందిస్తూ కాంగ్రెస్‌ రాష్ట్రపతి అభ్యర్థులు ప్రణబ్‌ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌ను సమర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. 

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వం లోని ‘మహా వికాస్‌ ఆఘాడి’ విశ్వాస పరీక్షలో నెగ్గి ఉద్దవ్‌ థాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరేసి చొప్పున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు