ఫడ్నవీస్‌ రాజీనామా 

9 Nov, 2019 02:56 IST|Sakshi
గవర్నర్‌కు రాజీనామా లేఖను అందిస్తున్న ఫడ్నవీస్‌  

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగింపు

సీఎం పీఠం పంచుకుంటామనలేదు: బీజేపీ

ఆ షరతుకు ఒప్పుకుంటేనే చర్చలు: శివసేన 

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ రాజీనామా చేశారు. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీకి శుక్రవారం రాజీనామా లేఖను సమర్పించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఫడ్నవీస్‌ను గవర్నర్‌ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు పక్షం రోజులు గడచినా.. ప్రభుత్వ ఏర్పాటులో మెజారిటీ సాధించిన బీజేపీ, శివసేనల మధ్య అధికార పంపిణీ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరడం కావచ్చు లేదా రాష్ట్రపతి పాలన విధించడం కావచ్చు’ అని రాజీనామా అనంతరం ఫడ్నవీస్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యానికి శివసేన తీరే కారణమని విమర్శించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని సమంగా పంచుకోవాలని తన సమక్షంలో  శివసేనతో ఎలాంటి అంగీకారం కుదరలేదని ఫడ్నవీస్‌ మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, పార్టీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ కూడా చెప్పారని వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కోరేందుకు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు పలుమార్లు ఫోన్‌ చేశానని, తన కాల్స్‌కు ఆయన జవాబివ్వలేదని ఫడ్నవీస్‌ చెప్పారు. ‘బీజేపీతో కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న శివసేన పాలసీ సరైంది కాదు’ అని వ్యాఖ్యానించారు.  కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠవాలే శుక్రవారం శరద్‌పవార్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది.  

ఆ ఒప్పందమేమీ లేదు 
బీజేపీ, శివసేనల మధ్య ముఖ్యమంత్రి పదవి సహా అధికారాన్ని సమానంగా పంచుకోవాలనే ఒప్పందమేదీ కుదరలేదని బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ శుక్రవారం స్పష్టం చేశారు. ‘ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకే సీఎం పదవి దక్కాలని గతంలో దివంగత బాల్‌ ఠాక్రే కూడా చెప్పారు’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. మరోవైపు, సీఎం పదవిని సమానంగా పంచుకునేందుకు అంగీకరిస్తేనే శివసేన వద్దకు చర్చల నిమిత్తం బీజేపీ రావాలని సేన నేత సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

 కాగా,  నవంబర్‌ 15 వరకు సేన ఎమ్మెల్యేలంతా ఒక రిసార్ట్‌లో ఉండబోతున్నారని, అక్కడ వారికి భద్రత కల్పించాలని కోరుతూ ముంబై పోలీస్‌ కమిషనర్‌కు శివసేన నేత మిలింద్‌ నర్వేకర్‌ ఒక లేఖ రాశారు. బీజేపీ తనను అబద్ధాల కోరుగా చిత్రించేందుకు ప్రయత్నిస్తోందని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. ‘సీఎం పదవి విషయంలో ఎలాంటి ఒప్పందం కుదరలేదంటూ నన్ను అసత్యాలు చెప్పేవాడిగా బీజేపీ ప్రచారం చేయడం బాధిస్తోంది. ఆ తీరును సహించబోం’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు