ఆపరేషన్‌‌ కమల్‌ : టార్గెట్‌ అదేనా..?

18 Jul, 2020 14:50 IST|Sakshi

అమిత్‌ షాతో ఫడ్నవిస్‌​ భేటీ

సాక్షి, ముంబై :  దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నా బీజేపీ మాత్రం ప్రభుత్వాల ఏర్పాటుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలనే రాజస్తాన్‌, మహరాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజస్తాన్‌లో మాత్రం బీజేపీకి గట్టి పరిణామాలే ఎదురైయ్యాయి. తిరుగుబాటు నేత సచిన్‌‌ పైలట్‌ రూపంలో వచ్చిన పెను విపత్తును రాజకీయాల్లో కాకలు తీరిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లత్‌ సమర్థవంతంగా ఎదుర్కొగలిగారు. దీంతో సంకీర్ణ సర్కార్‌తో ఊగిసలాడుతున్న మహారాష్ట్రపై బీజేపీ కన్ను పడినట్లు తెలుస్తోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి కాషాయ జెండా ఎగరేసే విధంగా కేంద్రంలోని అధికార పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచించినట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (రసవత్తరంగా రాజస్తాన్‌ డ్రామా)

శరద్‌ పవార్‌కు గాలం..!
దీనిలో భాగంగానే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను ముందుగా ఎన్డీయేలో చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ పవార్‌కు ఇటీవల ఆహ్వానం సైతం పంపారు. కేం‍ద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో ఎన్సీపీ చేరితే దేశ, రాష్ట్ర అభివృద్దికి ఎంతో మంచిదని కేంద్రమంత్రి సెలవిచ్చారు. దీనిపై శరద్‌ పవార్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భేదాభిప్రాయాలు ఉన్నాయని, మరికొంత కాలంలోనే ప్రభుత్వం కూలిపోవడం ఖయమని పలువురు బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. (రండి.. ఎన్డీయేలో చేరండి.. అప్పుడే..!)

ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో శనివారం భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఫడ్నవిస్‌ పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్లతో వరస భేటీలు నిర్వహిస్తున్నారు. ‘ఆపరేషన్‌ కమల్‌’ పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భేటీలపై వస్తున్న రాజకీయపరమైన వార్తలను ఫడ్నవిస్‌ కొట్టిపారేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే తాను ఢిల్లీ పర్యటనకు వెళ్లానని స్పష్టం చేశారు. అందరూ అనుకుంటున్నట్లు మహారాష్ట్రలో ఆపరేషన్‌ కమల్‌ లేదని తెలిపారు. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో నెలకొన్ని మనస్పర్ధాలు ప్రభుత్వాన్ని కూల్చక తప్పదని జోస్యం చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా