ఫడ్నవిస్‌కు కఠిన పరీక్షే!

9 Apr, 2019 09:03 IST|Sakshi

రైతు రుణమాఫీ ఆత్మహత్యలు నిరుద్యోగం..

ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అంశాలివే..

మహారాష్ట్రలో బీజేపీ–శివసేన కూటమికి సవాల్‌..

బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ ప్రకటించింది కానీ, ఇవేవీ రైతుల బలవన్మరణాలను అరికట్టలేకపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 2015లో 6,268 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018 నాటికి ఈ సంఖ్య 11,995కు చేరుకుంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 350 మందికిపైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది.

వ్యవసాయ సంక్షోభం.. రైతు ఆత్మహత్యలు.. పెరిగిపోతున్న నిరుద్యోగం! ఏప్రిల్‌ 11న తొలి దశ పోలింగ్‌ జరగనున్న మహారాష్ట్రలో ఓటర్లను ప్రభావితం చేయగల అంశాలు! ఉత్తరప్రదేశ్‌ తరువాత అత్యధిక లోక్‌సభ స్థానాలు (48) ఉన్న మహారాష్ట్రలో సగభాగం కరవుతో అల్లాడుతుండగా.. విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ఫలితంగా ఈ ప్రాంతంలో పలువురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకవైపు కరవు వెంటాడుతుండగా.. ఇంకోవైపు తగినన్ని తాగునీళ్లు కూడా అందకపోవడం.. వ్యవసాయ రుణాలకూ బ్యాంకులు నిరాసక్తత చూపడం రైతులకు గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా మారింది.

బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ ప్రకటించింది కానీ, ఇవేవీ రైతుల బలవన్మరణాలను అరికట్టలేకపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 2015లో 6,268 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018 నాటికి ఈ సంఖ్య 11,995కు చేరుకుంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే 350 మందికిపైగా రైతులు ప్రాణాలు తీసుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది. గతంలో యావత్మల్‌ ప్రాంతం రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉంటే.. ఇప్పుడు అది పొరుగున ఉన్న అకోలాకు మారిపోయిందని, ఈ ఏడాది ఇప్పటివరకు అక్కడ 102 మంది మరణించారని వసంత్‌రావ్‌ నాయక్‌ షేటీ స్వావలంబన్‌ మిషన్‌ చైర్మన్‌ కిషోర్‌ తివారీ అంటున్నారు.

విదర్భలో ఏడింటిపై ప్రభావం
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఉండే ఏడు లోక్‌సభ స్థానాల్లో వ్యవసాయ సంక్షోభం అనేది అధికార బీజేపీ– సేన కూటమిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరాఠ్వాడ ప్రాంతంలోని మొత్తం ఎనిమిది స్థానాల్లోనూ కూటమికి నష్టం జరగనుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెద్దనోట్ల రద్దు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అధికార పక్షంపై అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో కేవలం 4,400 దిగువస్థాయి ఉద్యోగాల భర్తీకి ఏకంగా ఎనిమిది లక్షల దరఖాస్తులు అందడం గ్రామీణ నిరుద్యోగం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అలాగే, గత డిసెంబరులో 1,218 ఫారెస్ట్‌ గార్డ్‌ ఉద్యోగాలకు 4.3 లక్షల దరఖాస్తులు అందాయి. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక ప్రీ పోల్‌ సర్వేలోనూ ఉద్యోగాలు తమ తొలి ప్రాధాన్యమని ప్రజలు స్పష్టం చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 42 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఓటు వేసేందుకు తమను ప్రభావితం చేసే రెండో అంశం తాగునీటి లభ్యత అనీ, వ్యవసాయ రుణాలు అందుబాటులో ఉండటం మూడో ప్రాధాన్యమని వీరు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రుణ లభ్యత 51 శాతం మందిని ఇబ్బంది పెడుతుండగా సాగునీరు 49 శాతం మందికి సమస్యగా ఉంది. వ్యవసాయోత్పత్తులకు ఎక్కువ ధరలు.. 46 శాతం మంది ఓటు ఎవరికి వేయాలో నిర్ణయిస్తోంది. ఈ గణాంకాలన్నీ గ్రామీణ మహారాష్ట్రవైతే.. నగర ప్రాంతాల పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ఉద్యోగాలు 48 శాతం మందికి, తాగునీరు 43 శాతం మందికి ప్రధాన సమస్యలు కాగా.. ట్రాఫిక్‌ ఇబ్బందులు 35 శాతం మంది ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ అంశాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి కూడా ఎక్కువే ఉంది.

ఏతావాతా...
మహారాష్ట్రలో అధికార బీజేపీ – శివసేన కూటమి ఈ ఎన్నికల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కోనుంది. ఈ కారణంగానే ప్రధాని మోదీ తరచూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌పై విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వార్ధా, గోండియాల్లో జరిగిన మోదీ సభల్లో ప్రభుత్వ విజయాలను కాకుండా రాహుల్, పవార్‌పై విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇక్కడ గమనార్హం. ఏప్రిల్‌ ఒకటిన వార్ధా సమీపంలో జరిగిన సభలో ‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని సృష్టించినందుకు గాను ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారన్న మోదీ వ్యాఖ్య ఈ అంశాన్ని ధ్రువీకరిస్తోంది. గోండియా సభలో పవార్‌పై విరుచుకుపడుతూ ఎన్సీపీ అగ్రనేతలకు కునుకు పట్టడం లేదని, తీహార్‌ జైల్లో ఉన్న వ్యక్తి తమ రహస్యాలను బయట పెట్టేస్తారన్న భయం వారిని వెన్నాడుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను మోసంగా అభివర్ణించిన మోదీ.. దేశద్రోహం చట్టాలను తొలగిస్తామని ప్రకటించడం పాకిస్తానీ కుట్రలో భాగమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో న్యాయ్‌ పథకం గురించి.. ఉద్యోగ కల్పన గురించి మాట్లాడటం గమనార్హం.

రుణమాఫీతీరుపై ఆగ్రహం..
మహారాష్ట్రలో బీజేపీని వ్యతిరేకించేందుకు ఉన్న మరో బలీయమైన కారణం రైతు రుణమాఫీ అరకొర అమలు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కృషి సమ్మాన్‌ యోజన పేరుతో మొత్తం రూ.34,022 కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం 2017, జూన్‌ 4న ప్రకటించింది. పథకం మొత్తం 89 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుందని అంచనా వేశారు. ఇందులో కనీసం 40 లక్షల మంది రుణం పూర్తిగా మాఫీ అయిపోతుందని లెక్కకట్టారు. ఇదే జరిగి ఉంటే.. వారందరూ తాజాగా వ్యవసాయ రుణాలు తీసుకునే వీలేర్పడేది. కాకపోతే ఈ పథకం అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. ఎవరెవరికి రుణాలు మాఫీ అయ్యాయన్న అంశంపై అధికారిక సమాచారమేదీ లేదు. కాకపోతే అరకొరగా కొంతమందికి రుణాలు మాఫీ అయ్యాయని.. దాదాపు 18 శాతం మంది రైతులు మాత్రమే మళ్లీ రుణాలు పొందగలిగారని కిషోర్‌ తివారీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపితో పొత్తు పెట్టుకునేందుకు కొన్ని వారాల ముందు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే కూడా రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ అమలు చేశామని దేవేంద్ర ఫడ్నవిస్‌ చెబుతున్నారని, కానీ వాస్తవానికి ఒరిగిందేమీ లేదని...లబ్ధి పొందిన ఒక్క రైతును కూడా చూపించలేదని ఆయన విమర్శించారు. రైతులకు కనీస పరిహారం కూడా దక్కకపోగా, బీమా పేరుతో కొన్ని వందల రూపాయలు మాత్రం విదిల్చారన్న విమర్శలు ఉన్నాయి.
డేట్‌లైన్‌ ముంబై

టి.ఎన్‌.రఘునాథ
(రచయిత, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సీనియర్‌ జర్నలిస్టు. మహారాష్ట్ర రాజకీయాలను మూడు దశాబ్దాలుగా పరిశీలిస్తున్నారు. ‘ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ద పయనీర్‌’, ‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’, ‘ద బ్లిట్జ్‌’, ‘న్యూస్‌టైమ్‌’ దినపత్రికల్లో పనిచేశారు)

మరిన్ని వార్తలు