బిగ్‌ ట్విస్ట్‌: సీఎంగా ఫడ్నవిస్‌ ప్రమాణం

23 Nov, 2019 08:19 IST|Sakshi

డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం

కొలువుతీరిన బీజేపీ, ఎన్సీపీ ప్రభుత్వం​

సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్‌ నేత అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వారిచే ప్రమాణం చేయించారు. అయితే శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శుక్రవారం రాత్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తెర వెనుక వ్యూహాలు రచించిన బీజేపీ  అజిత్‌ పవార్‌తో రహస్య మంతనాలు చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు గవర్నర్‌ను కోరారు. రాత్రికి రాత్రే అనేక రాజకీయ పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో ఫడ్నవిస్‌ సీఎం ప్రమాణం చేశారు. అనంతరం ఫడ్నవిస్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని అన్నారు. సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న శివసేనకు ఎన్సీపీ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఒకవైపు సీఎంగా ఉద్దవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ఎన్సీపీ బీజేపీకి మద్దతు ప్రకటించింది. కాగా పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. దీనిపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎన్సీపీలో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. అజిత్‌ పవార్‌ వెంట 20కి పైగా ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో బీజేపీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. కాగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవిస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశామని గవర్నర్‌ తెలిపారు. (చదవండి: ‘మహా’ మలుపు.. రాత్రికి రాత్రి ఏం జరిగింది?)

మరిన్ని వార్తలు