వైఎస్సార్‌ సీపీలో చేరిన దేవినేని అవినాష్‌

14 Nov, 2019 16:39 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇసుక కొరత అంటూ దీక్షకు దిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కృష్ణాజిల్లాలో భారీ షాక్‌ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు  టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారిద్దరికీ ముఖ్యమంత్రి... కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అనంతరం దేవినేని అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ...‘రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారు. నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చే పార్టీలో చేరా. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు జాడల్లోనే నడుస్తా. టీడీపీలో మా వర్గం నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎన్నిసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు’  అని అన్నారు.

కాగా దేవినేని అవినాష్‌ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ‘గత రెండు నెలలుగా మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో పలు సందర్భాల్లో నేను టీడీపీని వీడుతున్నాను అంటూ పలు వదంతులు వచ్చాయి. అవి వచ్చాయి అనడం కంటే సృష్టించబడ‍్డాయి అంటే సబబుగా ఉంటుంది. మరో పక్క ఈ రెండు నెలలు నేను పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తూనే ఉన‍్నాను. ఆ వదంతుల వెనుక ఎవరు ఉన్నారు అనేది పార్టీ అధిష్టానానికి పలుసార్లు విన్నవించడం కూడా జరిగింది.

ఈ రోజు వరకూ మా సొంత ప్రయోజనాల గురించి ఏరోజూ ఆలోచించకుండా పార్టీ ఎక్కడికి వెళ్లి పోటీ చేయమంటే అక్కడికి వెళ్లి పోటీ చేసి పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా నడుచుకున్న విషయం మీకు తెలియంది కాదు. ఇదంతా పక్కన పెడితే మేము మొదటి నుంచి అడిగింది కానీ ఈ రోజు అడుగుతుంది కానీ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఉన్న మా సొంత  క్యాడర్‌కి ఏ రోజున అక్కడి స్థానిక నాయకత్వం సముచిత స్థానం కల్పించకపోగా పలు ఇబ్బందులకి గురి చేశారు. ఈ విషయంపై పలుసార్లు మీకు ఇప్పటికే విన్నవించాను. 

చదవండి: టీడీపీకి దేవినేని అవినాష్ గుడ్‌బై

చెప్పిన ప్రతిసారీ తగిన న్యాయం చేస్తాం అని మీరు చెప్పినా వాస్తవ పరిస్థితుల్లో అది కార్యరూపం దాల్చకపోగా ఇక మీదట న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కూడా ఏ కోశానా కనిపించని పరిస్థితుల్లో, వేలాదిగా ఉన్న మా సొంత అనుచరగణం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉండటమే కాక ఇకపై పార్టీలో జరిగే అవమానాలు తట్టుకునే ఓపిక లేదు అని పలుమార్లు నా వద్ద వారు విన్నవించుకున్నారు. గత నలభై ఏళ్లుగా మా కుటుంబానికి అండగా నిలబడి మమ్మల్ని నడిపిస్తున్న అనుచరుల మనోభావాలే మాకు అత్యంత ముఖ్యమయిన వారివల్లే  నేను కానీ మా కుటుంబం కానీ ఇక్కడ ఉన్నాం. నాకున్న హై కమాండ్‌  మా కుటుంబ అభిమానులు మాత్రమే అని మరొక్కసారి తెలియచేసుకుంటూ నా తెలుగు యువత అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను.  నన్ను టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించి గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని దేవినేని అవినాష్‌ తన లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా