‘అందుకనే సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు’

20 Jan, 2020 19:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : వెనకబడిన ప్రాంతాల్ని విస్మరిస్తే సమస్యలు తప్పవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అది గమనించే సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజధానిగా అమరావతి కొనసాగితే మళ్లీ ఉద్యమాలు వచ్చేవని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు అందరం కలిసి ఉండటం సాధ్యమయ్యేదా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నానని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంటే.. వెనక నుంచి అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్లే.. తమ ప్రాంతాల్లో వెలుగులు వచ్చాయని ధర్మాన ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి : రాజధానులు ఎంతెంత దూరం)

టీడీపీ పాలనలో చర్చలు లేవు..
రాజధానిని చంద్రబాబు పూర్తిగా వ్యాపార ధోరణితోనే చూశారని ధర్మాన విమర్శించారు. రాజధాని నిర్మాణం అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించే విధంగా ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని గుర్తు చేశారు. ఎవరితో చర్చింకుండానే టీడీపీ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ పర్యటన పూర్తి కాకముందే గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, సుప్రీం కోర్టుపై గౌరవం లేదని ధర్మాన అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిన విధంగానే సీఎం జగన్‌ చేశారని తెలిపారు. విశాఖ ఏమైనా మారుమూల ప్రాంతమా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన నిలదీశారు. 

చదవండి : 
అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
రాజధాని రైతులకు వరాలు
చంద్రబాబుకు సవాల్‌ విసిరిన కొడాలి నాని

>
మరిన్ని వార్తలు