‘తిత్లీ’ బాధితులకు అండగా ఉంటాం

13 Oct, 2018 05:10 IST|Sakshi
డోకులపాడులో బాధితులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం తదితరులు

     ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా పోరాడతాం

     వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన భరోసా

     తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన  

వజ్రపుకొత్తూరు రూరల్‌: తిత్లీ తుపాను బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను ప్రభావిత గ్రామాలైన చినవంక, డోకులపాడు, బాతుపురం, పల్లెసారథిలలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క బాధితునికీ నష్ట పరిహారం అందించేందుకు వైఎస్సార్‌ సీపీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపడుతోంది తప్ప పూర్తిస్థాయిలో ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఆయా గ్రామాల్లో వీధివీధిలో పర్యటిస్తూ బాధితుల సమస్యలను వింటూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గురయ్యనాయుడు, వైఎస్సార్‌ సీపీ మండల ప్రధాన కార్యదర్శి తమ్మినేని శాంతారావు, శ్రీనివాసరావు, ధర్మారావు తదితరులు ఉన్నారు.

సీఎం తీరును నిరసిస్తూ ప్రభుత్వ వాహనాల అడ్డగింత...
తిత్లీ తుపాను నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు తమ గ్రామానికి రాకపోవడంపై వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం, పెదవంక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత అక్కుపల్లికి వచ్చిన సీఎం అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న బాతుపురం, పెదవంక గ్రామాల్లో దిగకపోవడంపై బాధితులు మండపడ్డారు. ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా సీఎం కాన్వాయ్‌ వెళ్లిన వెంటనే మిగిలిన ప్రభుత్వ వాహనాలు వెళ్లకుండా పెద్ద పెద్ద దుంగలు, చెట్లు కొమ్మలను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ కనీసం తాము ఎలా ఉన్నామో తెలుసుకోకుండా, వాహనం దిగకుండా వెళ్లిపోవడం తగదన్నారు. అదే సమయంలో దర్మాన ప్రసాదరావు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పలాస నియోజకవర్గ కన్వీనర్‌ సీదిరి అప్పలరాజు వచ్చి బాధితులను ఓదార్చారు. అనంతరం అడ్డంగా ఉన్న దుంగలను, చెట్ల కొమ్మలను నాయకులే స్వయంగా తొలగించారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వారు హామీ ఇచ్చారు. 

తుపాను నష్టంపై ధర్మాన నేతృత్వంలో కమిటీ
సాక్షి, హైదరాబాద్‌: తిత్లీ తుపాను వల్ల దెబ్బ తిన్న శ్రీకాకుళం జిల్లాలో ఆస్తి నష్టాన్ని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. భూమన కరుణాకరరెడ్డి, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ నేతలు రెడ్డి శాంతి, రఘురామ్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. తుపాను వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి, జరిగిన నష్టాన్ని ఈ కమిటీ అంచనా వేసి పార్టీ అధ్యక్షుడికి నివేదిక సమర్పిస్తుంది. 

మరిన్ని వార్తలు