డోన్‌ రాజు ఎవరో?

14 Mar, 2019 09:02 IST|Sakshi

ప్రజా సమస్యలపై పోరుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బుగ్గనకు మంచి గుర్తింపు 

ఆక్రమణలతో చెలరేగిన డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ ప్రతాప్‌ 

చంద్రబాబు కరెంట్‌ షాక్‌తో వేలాది గ్రానైట్‌ పరిశ్రమల మూత

మహాభారతంలో పాండవుల గురువైన ద్రోణాచార్యుడుఈ ప్రాంతంలోని ఒక కొండపై తపస్సు చేయడంతో ద్రోణాచలమనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధి. కాలక్రమంలో ఆ పేరు కాస్తా డోన్‌గా స్థిరపడింది. కర్నూలు జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీల్లో ఒకటైన డోన్‌ జిల్లాలో పేరొందిన రైల్వే జంక్షన్‌. రాజకీయంగాను, చారిత్రకంగాను ఎంతో ప్రాధాన్యమున్న నియోజకవర్గంలో ఈ ఐదేళ్లూ అరాచకాలు, భూ ఆక్రమణలతో అధికార పార్టీ నేతలు రెచ్చిపోయారు. స్వయానా డిప్యూటీ సీఎం సోదరుడే ఈ దందాలకు లీడరు. అత్యంత నాణ్యమైన సున్నపురాయికి, మైనింగ్‌ పరిశ్రమలకు డోన్‌ పెట్టింది పేరు. ఆ పరిశ్రమలు కాస్తా చంద్రబాబు సర్కారు కరెంటు షాక్‌తో కుదేలయ్యాయి. వరుసగా నాలుగేళ్లు పెరిగిన విద్యుత్‌ చార్జీల దెబ్బతో పాటు రాయల్టీ పెంపు తదితర కారణాలతో 1500 గ్రానైట్‌ పరిశ్రమలు మూతపడ్డాయి.  లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. 

వైఎస్సార్‌సీపీ నుంచి బుగ్గన 
రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై 11,152 ఓట్ల మెజార్టీతో బుగ్గన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచాక తన సొంత నిధులతో బేతంచర్లలో షాదీఖానా, డోన్‌ హైస్కూల్‌లో అదనపు తరగతులు నిర్మించారు. ప్యాపిలిలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు పనుల్ని ప్రారంభించారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్‌ హోదాలో రాష్ట్రంలో వివిధ నౌకాశ్రయాల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై అధికారులను నిలదీశారు. వివిధ పథకాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ఎండగట్టారు. సౌమ్యుడిగా పేరొందడంతో పాటు సమస్యలపై అవగాహన ఉన్న మేథావిగా బుగ్గనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాల్ని ఎదిరిస్తూ.. ప్రజా సమస్యలపై నిలదీస్తూ ముందుకు సాగుతున్నారు.  

టీడీపీ నుంచి మళ్లీ కేఈ ప్రతాపే! 
తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి కేఈ ప్రతాప్‌ పోటీలో ఉన్నారు. వాస్తవానికి కోట్ల కుటుంబం టీడీపీలో చేరాక డోన్‌ టికెట్‌ ఇవ్వాలని కేఈ సుజాతమ్మ పట్టుబట్టారు. అయితే ప్రతాప్‌కే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం సోదరుడి హోదాలో రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న అనేక స్థలాల్ని ఆక్రమించారనే పేరుంది. అధికారుల్ని బెదిరించి ప్రోటోకాల్‌ పాటించేలా చేసుకున్నారన్న తీవ్ర విమర్శలున్నాయి. డోన్‌ నియోజకవర్గంలో జరిగిన మరుగుదొడ్ల కుంభకోణంలో ఒక ఎంపీడీవో సస్పెండయ్యారు. ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మించకుండానే రూ.కోట్ల నిధుల్ని అధికారపార్టీ నేతలు కాజేశారు.  

జాగా కనిపిస్తే కబ్జా
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌.. ఖాళీ స్థలం కనబడితే చాలు ఆక్రమణలకు తెరదీశారు. డోన్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న వక్ఫ్‌భూమిని ఆక్రమించారు. ఏకంగా గ్రామాల్లో పొలాలకు సాగునీరందించే వాగు స్థలం కబ్జాకు ప్రయత్నించారు. మున్సిపాలిటీలో ఇతరులు టెండర్‌లో పాల్గొంటే ఏకంగా భౌతిక దాడులకు దిగారు.  

విద్యుత్, రాయల్టీ చార్జీలు తగ్గిస్తామని జగన్‌ హామీ 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గ్రానైట్‌ పరిశ్రమలకు కరెంటు చార్జీల్ని యూనిట్‌కు రూపాయి మేర తగ్గించగా.. చంద్రబాబు సీఎం అయ్యాక అమాంతం పెంచేశారు. 2014 వరకూ టన్నుకు రూ.280 ఉన్న రాయల్టీ చంద్రబాబు హయాం లో బ్లాక్‌ గ్రానైట్‌పై రూ.600, కలర్‌ గ్రానైట్‌పై రూ.560కు పెంచారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఎఫెక్ట్‌తో బ్లాక్‌ గ్రానైట్‌పై రాయల్టీని టన్నుకు రూ.300కు తగ్గించారు. గ్రానైట్‌ పరిశ్రమకు విద్యుత్, రాయల్టీ చార్జీలు తగ్గించడంతో పాటు డోన్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. డోన్‌ పట్టణంతో పాటు మరికొన్ని గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి మంచినీటి సరఫరా పథకాన్ని దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రారంభోత్సవంతో సరిపెట్టింది.  

ప్రధాన సమస్యలు :
నియోజకవర్గపు పరిధిలో ఖనిజ సంపద అపారంగా ఉంది. సున్నపురాయి, గ్రానైట్, మొజాయిక్‌ చిప్స్, కలర్‌ స్టోన్స్‌ ఆధారిత పరిశ్రమలున్నాయి. ఇక్కడ లభించే ఖనిజానికి సరైన మార్కెట్‌ లేకపోవడం, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీలు పెంచడం, రాయల్టీ చార్జీలు పెరగడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం లేకపోవడంతో అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. 45 వేల మంది ఉపాధి కోల్పోయారు. గత ఎన్నికల సమయంలో పరిశ్రమల్ని ఆదుకునేందుకు డెహ్రడూన్‌ తరహాలో మైనింగ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారు.  డోన్‌ నియోజకవర్గంలోని చెరువులు నీరు లేక నోరెళ్లబెట్టాయి. చెరువులకు హంద్రీ–నీవా ద్వారా నీటిని తరలించాలి.   పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రసుత్తం డోన్‌లో ఉన్న 30 పడకలున్న ప్రభుత్వ ఆస్పత్రి స్థాయిని 100 పడకలకు పెంచాలి.   బాలికలు ఉన్నత చదువులు చదివేందుకు మహిళా, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటు అవసరం.  ప్యాపిలిలో 10 పడకల ఆస్పత్రిని 30 పడకలకు పెంచాలి.  బేతంచర్లకు అవుకు రిజర్వాయర్‌ నుంచి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీనీ చంద్రబాబు విస్మరించారు. 
– కె.జి. రాఘవేంద్రరెడ్డి, సాక్షి ప్రతినిధి, కర్నూలు

మరిన్ని వార్తలు