రాహుల్‌ గాంధీ హిందువు కాదా?!!

30 Nov, 2017 14:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తలమునకలైన కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అసలు హిందువా, కాదా ? అన్న అంశంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. రాహుల్‌ గాంధీ బుధవారం నాడు సోమ్‌నాథ్‌ ఆలయన్ని సందర్శించినప్పుడు హిందువేతరులు సంతకం చేయాల్సిన పుస్తకంలో సంతకం చేశారని, ఈ విధంగా రాహుల్‌ గాంధీ హిందువు కాదని తానే స్వయంగా ఒప్పుకున్నారంటూ బీజేపీ వర్గాలు, మద్దతుదారులు బుధవారం నుంచి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. 

మొట్టమొదట ఈ కథనాన్ని ‘జీ గుజరాతీ’ ప్రసారం చేసింది. జీ గుజరాతీకి చెందిన జర్నలిస్ట్‌ తేజాష్‌ మోదీ సోమ్‌నాథ్‌ ఆలయం వద్ద నుంచి పంపిన ట్వీట్‌ను యధాతథంగా ‘జీ గుజరాతీ’ ప్రచారం చేయడంతో వివాదం రాజుకుంది. ‘కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ సోమ్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆలయ ట్రస్ట్‌ హిందువులుకానీ వారి కోసం ఏర్పాటు చేసిన పుస్తకంలో రాహుల్‌ గాంధీ తన పేరు రాసి సంతకం చేశారు. ఆయన కిందనే అహ్మద్‌ పటేల్‌ కూడా తన పేరు రాసుకొని సంతకం చేశారు’ అని తేజాష్‌ మోదీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం అధిపతి అమిత్‌ మాలవియా ఆగమేఘాల మీద పార్టీ ట్విట్టర్‌ నిర్వాహకులందరికి ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఆయన తొందరపడి చేసిన ట్వీట్‌ విస్తతంగా సోషల్‌ మీడియాతోపాటు ముద్రణా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో విస్తతంగా ప్రచారమైంది. అది రాహుల్‌ గాంధీ హిందువు కాదా? అంటూ కొత్త చర్చను లేవదీసింది.

ఇలా తొందరపడి తప్పుడు వార్తలను ట్వీట్‌ చేయడం అమిత్‌ మాలవియాకు మొదటి నుంచి అలవాటే. ఇప్పటికీ ఐదుసార్లు ఆయన తప్పుడు వార్తలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. పశ్చిమ బెంగాల్‌ మత కల్లోలు జరుగుతున్నప్పుడు ‘పట్టపగలు ఓ హిందువు స్త్రీని వివస్త్రను చేస్తున్న ముస్లిం గుండాలు’ అనే శీర్శికన ఓ మరాఠీని సినిమా షూటింగ్‌ స్టిల్‌ను ఎవరో పోస్ట్‌ చేస్తే దానికి మాలవియా విస్తత ప్రచారం కల్పించారు. సరే, ఆయనంటే బీజేపీ పక్కా మనిషి కనుక అలాంటి ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారని పక్కన పెట్టొచ్చేమోగానీ కొన్ని ఆంగ్ల పత్రికలు, ఛానళ్లు వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే హిందువు కానంటూ రాహుల్‌ గాంధీ దండోరా వేసుకున్నాడంటూ వార్తలను ప్రసారం చేయడం శోచనీయం. ముఖ్యంగా ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఈ వార్తకు మొదటి పేజీలో బ్యానర్‌ ప్రాముఖ్యతను ఇవ్వడం విడ్డూరం. 

గూగుల్‌లో నిక్షిప్తమైవున్న రాహుల్‌ రాతతో ఆలయ పుస్తకంలో రాహుల్‌ గాంధీ పేరుతో ఉన్న రాతను పోల్చి చూసినట్లయితే అది రాహుల్‌ గాంధీయే రాశారా, మరెవరైనా రాశారా? అన్న విషయం ఇట్టే తేలిపోయేది. ఎవరు కూడా వాస్తవాలను తెలుసుకునేందుకు ఆ మాత్రం కసరత్తు చేయకపోవడం శోచనీయం. ముఖ్యంగా మీడియాకైతే ఇది సిగ్గుచేటే! అందులోబాటులో ఉన్న రెండు రాహుల్‌ గాంధీ చేతి రాతలకు, సోమ్‌నాథ్‌ ఆలయ పుస్తకంలోని రాహుల్‌ చేతి రాతకు, సంతకానికి ఎక్కడా పోలిక లేదు. మరెవరో దీన్ని రాసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పైగా రాహుల్‌ గాంధీ తన పేరును ఎప్పుడు కూడా రాహుల్‌ గాంధీజీ అని రాసుకోరు. పుస్తకంలో రాహుల్‌ గాంధీజీ అని రాసి ఉంది. అహ్మద్‌ పటేల్‌ పేరు ఇంగ్లీషు అక్షరాల్లో ‘ఏహెచ్‌ఎంఈడీ పీఏటీఈఎల్‌’ను ఏహెచ్‌ఏఎంఈడీగా తప్పుగా రాశారు. అహ్మద్‌ పటేల్‌ తన పేరును తప్పుగా రాసుకోరుగదా! అంతేకాకుండా రాహుల్‌ గాంధీజీ, అహ్మద్‌ పటేల్‌ పేర్లను ఎవరో ఒకరే రాసినట్టుగా రాతను చూస్తే స్పష్టం అవుతోంది. 

రాహుల్‌ గాంధీ సోమ్‌నాథ్‌ ఆలయంలో సందర్శకుల పుస్తకంలో చేసిన సంతకాన్ని కాంగ్రెస్‌ పార్టీ మీడియాకు విడుదల చేసింది. తాను హిందువును కానంటూ మరే పుస్తకంలోనూ ఆయన సంతకం చేయలేదంటూ వివరణ ఇచ్చింది. గాంధీ సంతకం చేసిన పేజీనీ కూడా ట్వీట్‌ చే సింది. రాహుల్‌ గాంధీ ఒక్క సందర్శకుల పుస్తకంలో మినహా మరే పుస్తకంలో సంతకం చేయలేదంటూ సోమ్‌నాథ్‌ ఆలయం ట్రస్ట్‌ కార్యదర్శి పీకే లహరి మీడియాకు స్పష్టం చేశారు. మరి రాహుల్, పటేల్‌ పేరిట హిందువేతరుల పుస్తకంలో ఎవరు సంతకం చేశారు? రాహుల్‌ వెంట ఆలయంలోకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించాలంటే ఈ పుస్తకంలో సంతకం చేయాలంటూ ఎవరో ఆలయం పుస్తకం ఇస్తే అందులో కాంగ్రెస్‌ పార్టీ మీడియా కోఆర్డినేటర్‌ మనోజ్‌ త్యాగీ... రాహుల్, పటేల్‌ పేర్లు రాసి సంతకం చేశారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించుకోడానికి మనోజ్‌ త్యాగీ అందుబాటులో లేరు. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గుజరాత్‌ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత కల్పించాల్సిందిపోయి పనికిమాలిన అంశాలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం ఎవరిని తప్పుదోవ పట్టించడానికి? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో నాడు ఇందిరాగాంధీ గుజరాత్‌ను పర్యటించినప్పుడు మోర్బీలో ముక్కుమూసుకున్నారని విమర్శించడంలో ఉద్దేశం ఏమిటీ?

మరిన్ని వార్తలు