ఏవీ అనుచరులపై మంత్రి అఖిలప్రియ వర్గీయుల దాడి

21 Apr, 2018 07:26 IST|Sakshi
ఆళ్లగడ్డలో దీక్ష చేపట్టిన మంత్రి అఖిలప్రియ

దీక్షల సాక్షిగా టీడీపీలో మరోసారి బయటపడిన విభేదాలు 

కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డలో ఎవరి దారి వారిదే 

ఏవీ అనుచరులపై మంత్రి అఖిల వర్గీయుల దాడి     

సాక్షి ప్రతినిధి, కర్నూలు : అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు దీక్షల సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఎవరికి వారుగా  దీక్షలు చేపట్టారు. ‘ధర్మపోరాట దీక్ష’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు దీక్షలు చేపట్టారు. అయితే, ఎవరికి వారుగా బలప్రదర్శన తరహాలో వీటిని చేపట్టడం గమనార్హం. ఆళ్లగడ్డలో ఏకంగా దీక్షకు తరలి వచ్చిన ఏవీ సుబ్బారెడ్డి అనుచరులపై మంత్రి వర్గీయులు దాడికి దిగారు. పరిస్థితి కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది.

నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీగా చేరుకుని.. ఆళ్లగడ్డలోని దీక్షా శిబిరానికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ అనుచరులు వారిపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. మంత్రాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డి, పార్టీ నేత మాధవరం రామకృష్ణారెడ్డి వర్గాలు పక్కపక్కనే వేర్వేరుగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశాయి. రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అనుమతించలేదు. కోడుమూరు నియోజకవర్గంలోని కోడుమూరు, గూడూరు, సి. బెళగల్‌లో అటు ఎమ్మెల్యే మణిగాంధీ వర్గం, ఇటు ఇన్‌చార్జ్‌ విష్ణువర్దన్‌రెడ్డి వర్గాలు వేర్వేరుగా దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి బలప్రదర్శనకు దిగాయి. దీంతో ఒక విధమైన ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

కర్నూలులో ఏకంగా మూడు ప్రాంతాల్లో దీక్షలు చేపట్టారు. జెడ్పీ ఆవరణలో చైర్మన్‌ దీక్ష చేయగా, రాజ్‌విహార్‌ సర్కిల్‌లో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి, కేడీసీసీబీ వద్ద సంస్థ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి దీక్షలు చేపట్టారు. జెడ్పీ చైర్మన్‌ దీక్ష సందర్భంగా ఉద్యోగులందరూ వచ్చి మద్దతు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఎస్వీ దీక్షకు మహిళలను బలవంతంగా మెప్మా అధికారుల సాయంతో తరలించారు. మంత్రి అఖిలప్రియ చేపట్టిన దీక్షకూ ఇదే పరిస్థితి. మొత్తమ్మీద జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో ఒకవైపు ఆధిపత్య పోరు, మరోవైపు అధికార దుర్వినియోగం స్పష్టంగా కన్పించింది. 
టీడీపీ ఆధ్వర్యంలో దీక్షలు 
కర్నూలు : ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో దీక్షలు చేపట్టారు. జెడ్పీ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌ జెడ్పీ ప్రాంగణంలో చేపట్టిన దీక్షకు ఎంపీలు టీజీ వెంకటేష్, బుట్టారేణుక, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పుష్పావతి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తదితరులు సంఘీభావం తెలిపారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌  ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని టీజీ సందర్శించారు.  కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాత ఆర్టీసీ డిపోలో దీక్ష చేపట్టారు.

ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి, డోన్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్, మంత్రాలయంలో ఇన్‌చార్జ్‌ తిక్కారెడ్డి, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఆలూరులో ఇన్‌చార్జ్‌ వీరభద్ర గౌడ్, బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి, నందికొట్కూరులో ఇన్‌చార్జ్‌ శివానందరెడ్డి, ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నంద్యాలలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. కర్నూలు కేంద్ర సహకార బ్యాంకు దగ్గర చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, డోన్‌లో కేఈ ప్రతాప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సందర్శించి సంఘీభావం  తెలిపారు.   

మరిన్ని వార్తలు