టిక్కెట్ల కొట్లాటలో మూడో కృష్ణుడు

24 Feb, 2019 09:15 IST|Sakshi

తెరపైకి ఎమ్మెల్యే వ్యతిరేకవర్గాల హడావుడి

సీఎంను కలిసి టికెట్‌ కోరిన పెళ్లకూరు

సీనియర్‌గా తనకు అవకాశం కల్పించాలని యర్రంరెడ్డి డిమాండ్‌

ముఖ్య నేత సూచనలతోనే యర్రంరెడ్డి సమావేశం

టికెట్‌ డిమాండ్‌తో నేడు చేజర్ల వర్గం సమావేశం

కోవూరు టీడీపీలో తీవ్ర గందరగోళం

కోవూరు టీడీపీలో టికెట్‌ కొట్లాట తార స్థాయికి చేరింది. రకరకాల సమీకరణలు, ఎత్తుగడలు, హామీలను తెరపైకి తెచ్చి నేతలు టికెట్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరు మొదలుకొని అవినీతి వరకు సొంత పార్టీ నేతలే సీఎంకు ఫిర్యాదు చేస్తూ కోవూరు రాజకీయాన్ని రసకందాయంలోకి నెట్టారు. నిన్నటి వరకు సిటింగ్‌ ఎమ్మెల్యే కాకుండా ఇద్దరు ఆశావహులు ఉండగా శనివారం మూడో కృష్ణుడు తెరపైకి వచ్చాడు. దీంతో కోవూరు టీడీపీలో గ్రూప్‌ చీలికలతో పాటు టికెట్‌ వివాదం తారస్థాయికి చేరడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో పాటు తిరుగుబాటు రాజకీయానికి తెరలేచింది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  కోవూరు టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిగా మారింది. సొంత పార్టీ నేతలే మండలాల్లో పార్టీ పరిస్థితి బాగా లేదని బాహాటంగా మాట్లాడటం, దీనికి తోడు టికెట్‌ గందరగోళం గత నెల రోజులుగా సాగుతుండటంతో కోవూరు టీడీపీలో అనిశ్చితి నెలకొంది. శనివారం టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి 25 నిమిషాలు మాట్లాడి టికెట్‌ ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఎమ్మెల్యే తీరుపైనా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు యథావిధిగా హామీలు గుప్పించగా ఇచ్చిన మాట ప్రకారం ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీనిపై వచ్చే వారంలో మళ్లీ కలవమని పెళ్లకూరుకు సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు పార్టీ ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ఎమ్మెల్యేతో పాటు పెళ్లకూరు పేరు చేర్చి సర్వే నిర్వహిస్తున్నారు. 

కొత్త కృష్ణుడు తయ్యారు..
కోవూరు టీడీపీలో రోజుకొక కృష్ణుడు హల్‌చల్‌ చేస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వర్గీయుడిగా ముద్రపడిన యర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డి శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి టికెట్‌ డిమాండ్‌ చేశారు. తాను పార్టీలో చాలా సీనియర్‌ అని ఈ పర్యాయం ఎమ్మెల్యే పోలంరెడ్డి, టికెట్‌ ఆశిస్తున్న పెళ్లకూరు, చేజర్లకు తనకు సహకరించాలని మండలాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదని తాను మాత్రమే అందర్ని సమన్వయం చేసుకొని పనిచేయగలుగుతానని చెప్పారు. ఇదిలా ఉండే యర్రంరెడ్డి ఆకస్మాత్తుగా తెరపైకి రావడం వెనుక పెద్ద ఎత్తుగడ రాజకీయం నడిచినట్లు సమాచారం. పార్టీ జిల్లా ముఖ్య నేత సూచనలతోనే సమావేశం పెట్టి టికెట్‌ డిమాండ్‌ చేశారని, తద్వారా 27న టికెట్‌ ఖరారు కాకుండా పెండింగ్‌లో ఉంటే తర్వాత అన్ని చూసుకొని లాబీయింగ్‌ చేసుకొని కావాల్సిన వారికి ఇప్పించుకోవచ్చని యోచనతో ఈ తతంగం నడిపించినట్లు సమాచారం.

ఈ క్రమంలో గోవర్ధన్‌రెడ్డి తిరుగుబాటు ఎవరికి మేలు చేస్తుంది.. ఎవరికి టికెట్‌ ఆశలు గల్లంతు చేస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక పార్టీలో మరో నేత చేజర్ల వెంకటేశ్వరరెడ్డి కూడా టికెట్‌ కోసం బలంగా యత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే సీఎంను ఒకసారి కలిసి టికెట్‌ కోరి ఆ మేరకు బలమైన లాబీయింగ్‌కు తెర తీశారు. ఈ నేపథ్యంలో చేజర్ల ముఖ్య అనుచరులతో నియోజకవర్గ స్థాయిలో ఆదివారం సమావేశం నిర్వహించి టికెట్‌ డిమాండ్‌ను బలంగా వినిపించడానికి హడావుడిగా యత్నాలు సాగిస్తున్నారు. ఈ వరుస పరిణామాలతో ఎమ్మెల్యే వర్గంలో తీవ్ర అలజడి రేగింది. రెండు నెలల క్రితం వరకు టికెట్‌ నీదే అని చెప్పి అధిష్టానం చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయిస్తే ఏం చేయాలనే తర్జనభర్జల్లో ఉన్నారు. మొత్తం మీద కోవూరు ‘దేశం’లో తిరుగుబాటు వ్యవహారం మరికొద్ది రోజులు కొనసాగనుంది.  

మరిన్ని వార్తలు