సీఎం రమేష్‌తో వేగలేం..!

8 Aug, 2018 08:04 IST|Sakshi

సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. ఎత్తుకు పైఎత్తులను కొనసాగిస్తున్నారు.ఎంపీ రమేష్‌ను నియంత్రించే ప్రక్రియ జోరందుకుంది. క్రమం తప్పకుండా ఫిర్యాదుల పరంపర చేపట్టారు. మొన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రి నారాలోకేష్‌ ఎదుట ఏకరువు పెట్టగా, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి కుండ బద్దలు
కొట్టారు. ఇక సీఎం రమేష్‌తో వేగలేం.. కట్టడి చేయండి ..పార్టీ ఉన్నతి కోసం దశాబ్దాలుగా కృషి చేసిన కుటుంబాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తినట్లు సమాచారం. జిల్లా టీడీపీలో రమేష్‌ ఓ వర్గానికి నాయకత్వం వహిస్తుండగా, మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మరో వర్గానికి అండగా నిలుస్తున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

ఈక్రమంలో ఒకరి కంటే మరొకరిది పైచేయి కావాలనే ఆరాటం అధికంగా కన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి రాజ్యసభ సభ్యుడు రమేష్‌ను ఉద్దేశించి ‘పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’స్థాయి కల్గిన వ్యక్తిగా ఘాటుగా విమర్శించారు. వరద వాస్తవికతను బహిర్గతం చేయడంతో ‘తేలు కుట్టిన దొంగలా’మౌనం వహించాల్సిన పరిస్థితి రమేష్‌ వంతయింది. కాగా ఈ తతంగం వెనుక మంత్రి ఆది ఉన్నారని గ్రహించిన రమేష్‌ భారీ ఎత్తుగడ వేశారు. ఈక్రమంలోనే ఉక్కు ఫ్యాక్టరీ ఆమరణ దీక్ష తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఉక్కుదీక్షను సీఎం రమేష్‌ ఎంచుకొని రాష్ట్ర మంత్రి వర్గాన్ని తన దీక్షాశిబిరానికి రప్పించుకున్నారు. వెరసి ఆ దీక్షకు మంత్రి ఆది పడిగాపులు కాయాల్సిన పరిస్థితులను సృష్టించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

రాజధానికి చేరిన ఫిర్యాదులు..ఎంపీ రమేష్‌ ఆమరణదీక్ష చేపట్టినంత కాలం జిల్లా టీడీపీ నాయకులు (మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మినహా) భుజకీర్తులు మిన్నంటాయి. ఆ కార్యక్రమం ముగియగానే యథావిధిగా ‘సిఎం రమేష్‌ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’నినాదం తెరపైకి వచ్చింది. మండలస్థాయిలో కూడా ప్రజా పరపతి లేని వ్యక్తి ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్నారు, పార్టీని అడ్డుపెట్టుకొని ఆదాయం గడిస్తున్నారు, వర్గ విభేదాలు సృష్టిస్తున్నారంటూ పలువురు నాయకులు ఫిర్యాదు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇదే విషయమై అమరావతిలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు కూలంకషంగా వివరించినట్లు సమాచారం.

రమేష్‌ను కట్టడి చేయకపోతే జిల్లాలో టీడీపీకి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సోమవారం సాయంత్రం అమరావతిలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితీష్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. మా తాత బద్వేల్‌ వీరారెడ్డి చిత్తశుద్ధితో పార్టీ ఉన్నతి కోసం కష్టపడ్డారు. పార్టీ అడ్డుపెట్టుకొని ఆర్థికంగా సంపాదనపై దృష్టి పెట్టలేదు, వ్యక్తిగత పరపతి కోసం వర్గాలను సృష్టించలేదు, ఎంపీ రమేష్‌ జిల్లాలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారు, మాలాంటి వారు కూడా పార్టీలో ఉనికి కోసం పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీని అడ్డుపెట్టుకొని లబ్ధిపొందుతూ పార్టీ కోసం పనిచేయడం లేదని, వ్యక్తిగతంగా జిల్లాలో రమేష్‌ ప్రజాపరపతి చాలా స్వల్పమని, కట్టడి చేయకపోతే కష్టమేనని తెలిపినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు సమక్షంలో ఎంపీపై ఫిర్యాదు చేయడంతో సీఎం ఆలకించినట్లు తెలుస్తోంది.

గతంలో వాసుకు చెక్‌పెట్టిన ప్రతిఫలమే...

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని మార్చాలంటూ గతంలో ఎంపీ రమేష్‌ దృష్టి సారించారు. ఆస్థానాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, లేదా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలతో భర్తీ చేయాలనే దిశగా జోరుగా పావులు కదిపారు. ఈక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి కూటమిది పైచేయి కావడంతో రమేష్‌ ప్రతిపాదన తెరమరుగైందని పలువురు వెల్లడిస్తున్నారు.

అందుకు ప్రతిగా రమేష్‌నాయుడు వైరి పక్షాన్ని ప్రోత్సహిస్తూ అధిష్టానం దృష్టికి నేరుగా ఫిర్యాదు వెళ్లేలా చర్యలు చేపడుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు. పైగా సాగునీటి ప్రాజెక్టుల్లో రమేష్‌ దక్కించుకున్న కాంట్రాక్టుల వివరాలు చేపట్టిన పనులు, అందులో లభించిన ప్రతిఫలం రికార్డులతో సహా కొందరు మంత్రి నారా లోకేష్‌ దృష్టిలో పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి ఆది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎంపీ రమేష్‌నాయుడుకు చెక్‌పెట్టుతోన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు