నా రేషన్‌కార్డు పోయింది.. కినో మొక్క కావాలి!

21 Mar, 2019 11:14 IST|Sakshi

హలో మేడమ్‌!.. ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకం జరుగుతోందట. రిక్రూట్‌మెంట్‌ వివరాలు చెప్పగలరా?..’‘సర్‌.. నా రేషన్‌ కార్డు పోయింది. కొత్తది కావాలంటే ఎవరి దగ్గరకెళ్లాలో చెబుతారా?’‘హలో మేడం..మా ఇంట్లో కినో మొక్కల్ని పెంచుకోవాలనుకుంటున్నాను.. అవెక్కడ దొరుకుతాయో చెప్పండి..’ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన 1950 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్‌కు ఉదాహరణలివి. ఎన్నికలకు సంబంధించిన సందేహాలు, అనుమానాలను తీర్చడానికి ఎన్నికల సంఘం ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేసింది. 24 గంటలూ అందుబాటులో ఉండే ఈ నంబర్‌కు ప్రజలెవరైనా ఫోన్‌ చేసి ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు తీర్చుకోవచ్చు.

ఫిబ్రవరి 12 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ హెల్ప్‌లైన్‌కు ఇంత వరకు 7,650 కాల్స్‌ వచ్చాయి. వాటిలో చాలా వరకు ఎన్నికలతో సంబంధం లేని కాల్సేనని సిబ్బంది చెబుతున్నారు. ‘ఎన్నికల విషయంలో ప్రజలెవరికీ ఎలాంటి అనుమానాలు వచ్చినా ఈ నంబరుకు ఫోన్‌చేసి అనుమానాలు తీర్చుకోవచ్చు. ఇందుకోసం 24 గంటలూ పని చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మాకు రోజూ వందల కాల్స్‌ వస్తున్నాయి. అయితే, వాళ్లు ఎన్నికల విషయం తప్ప మిగతా సందేహాలన్నీ అడుగుతున్నారం’టూ వాపోతున్నారు సిబ్బంది. ఒకాయన ఫోన్‌ చేసి వాళ్లూర్లో కరెంటు లేదని, కరెంటు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని అంటూ సుదీర్ఘ ప్రసంగం చేశాడు. వాళ్లూరికి కరెంటు ఇచ్చే వారికే ఓటేస్తానని చెప్పాడు’ అంటూ మరొకరు తమ అనుభవాన్ని వెల్లడించారు. దీనిపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ తాము ఒకందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తే ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు