తొలగించిన ఓటర్లు వీరే!

9 Jan, 2019 02:54 IST|Sakshi
మంగళవారం వివిధ పార్టీల నేతలతో సమావేశమై చర్చిస్తున్న సీఈఓ రజత్‌కుమార్‌

డీఈఓ, సీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటు

జాబితాలో పేరుంటే ఓకే.. లేదంటే దరఖాస్తు చేసుకోండి

ఓటర్లకు సీఈవో రజత్‌ కుమార్‌ సూచన

ఈ నెల 20–23న ఓటర్ల నమోదుకు ప్రత్యేక ప్రచారోద్యమం

పార్టీలతో సీఈవో భేటీ.. దరఖాస్తు గడువు పెంచాలన్న నేతలు  

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌ స్పందించారు. 2015, 2017లో తొలగించిన ఓటర్ల పేర్లతో జాబితాలను జిల్లా ఎన్నికల అధికారులకు (డీఈఓ) అందజేశారు. ఈ పేర్లను సీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లో సైతం పొందుపరిచినట్లు వెల్లడించారు. తొలగించిన ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నా యో లేవో ఓటర్లు చూసుకోవాలని.. ఒక వేళ పేరు తొలగించినట్లు గుర్తిస్తే ఓటరు నమోదు కోసం స్థానిక బీఎల్‌ఓను సంప్రదించాలని రజత్‌కుమార్‌ సూచించారు. 2019 జనవరి 1 అర్హత తేదీగా చేపట్టిన తాజా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మం గళవారం గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారోద్యమాన్ని నిర్వహి స్తున్నామని, ఇందుకు సహకరించాలని రాజకీయ పార్టీలకు కోరారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే చోట్లలో 23న ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆ రోజు పోలింగ్‌ కేంద్రా ల వద్ద బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ము సాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారని వెల్లడించారు.

ఓటర్ల నమోదు కార్యక్రమం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొం దించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. 18–19 ఏళ్ల వయస్సున్న యువతీ యువకులతో పాటు మహిళలు, వికలాంగులు, పట్టణ ఓటర్లు, ట్రాన్స్‌జెండర్లు ఓటరు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధి లోని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రజత్‌కుమార్‌ ప్రకటించారు. 

ఆ చర్యలివే.. 
-   ఈ నెల 9–11, 23–25 వరకు సాయంత్రం 4–7 గంటల వరకు బీఎల్‌ఓలు పోలింగ్‌ కేంద్రాల వద్ద కూర్చొని ఓటర్ల నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రత్యేక ప్రచారోద్యమం నిర్వహించనున్న జనవరి 20వ తేదీన బీఎల్‌ఓలు పూర్తి రోజు పోలింగ్‌ కేంద్రం వద్ద అందుబాటులో ఉంటారు.  
-    జీహెచ్‌ఎంసీలోని అన్ని వార్డుల కార్యాలయాల వద్ద ఓటర్లకు సహకరించేందుకు ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీతో పాటు ఓటరు నమోదుకు సంబంధించిన స్థితిగతులను ఆ కంప్యూటర్‌ ఆపరేటర్‌ దరఖాస్తుదారులకు తెలియజేస్తారు.  
-    జనవరి 8 నుంచి 25 వరకు నగరంలోని ప్రముఖ మాల్స్‌ వద్ద ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం డ్రాప్‌ బాక్కులను ఏర్పాటు చేయనున్నారు. 
-   ఈఆర్వోలు తమ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలను సందర్శించి అక్కడ చదువుతున్న యువతను ఓటరు నమోదులో పాల్గొనేలా చైతన్యపరుస్తారు. కళాశాలల ప్రిన్స్‌పాల్‌కు తగిన సంఖ్యలో ఓటరు నమోదు దరఖాస్తులు అందించడంతో పాటు కళాశాలలో డ్రాప్‌ బాక్స్‌ ఏర్పాటు చేస్తారు. 

జాబితా సవరణ గడువు పెంచండి 
అధికారులందరూ పంచాయతీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను పొడిగించాలని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌. రాంచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. గత మూడేళ్లల్లో పలు దఫాలుగా లక్షల ఓట్లను అడ్డగోలుగా తొలగించారని, ఓట్లు కోల్పోయిన వారందరికీ మళ్లీ ఓటరు జాబితాలో స్థానం కల్పించాలన్నారు. హైదరాబాద్‌ నగరంలో ఓటింగ్‌ శాతం పడిపోవడానికి కారణాలు తెలపాలని సీఈఓను కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఓట్లను అడ్డగోలుగా తొలగించిన బీఎల్‌ఓలను బాధ్యులు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి రావాల్సిన మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ నేత గట్టు రాంచందర్‌ రావు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు