జ్యోతిరాదిత్యపై డిగ్గీరాజా సెటైర్లు..

11 Mar, 2020 08:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టినందునే జ్యోతిరాదిత్య సింధియా బీజేపీకి దగ్గరయ్యారనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. జ్యోతిరాదిత్యను పార్టీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గ్వాలియర్‌ ప్రాంతంలో ఏ కాంగ్రెస్‌ నేతను అడిగినా అక్కడ గడిచిన 16 నెలల్లో సింథియా అనుమతి లేకుండా ఏ పనీ జరగదని చెబుతారని అన్నారు. మన బ్యాంకులు కుప్పకూలుతూ, మన రూపాయి దిగజారుతూ, ఆర్థిక​ వ్యవస్థలో ప్రకంపనలు రేగుతూ, సామాజిక సామరస్యం దెబ్బతింటున్న వేళ ఆయన (జ్యోతిరాదిత్య) మోదీ, షాల నేతృత్వంలో దేశానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని భావిస్తున్నారని డిగ్గీరాజా వ్యంగ్యోక్తులు విసిరారు.

మోదీ, షాల ప్రాపకంలో​ చల్లగా ఉండు మహరాజ్‌ అంటూ జ్యోతిరాదిత్యను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు జ్యోతిరాదిత్యకు మద్దతుగా 21 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది. జ్యోతిరాదిత్య తోడ్పాటుతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు బెంగళూర్‌లో బస చేసిన రెబెల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : ‘సింధియాకు స్వైన్ ప్లూ వచ్చింది’

మరిన్ని వార్తలు