‘నేను మాట్లాడితే కాంగ్రెస్‌కు ఓట్లు పడవు’

16 Oct, 2018 17:26 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌

భోపాల్‌ : తాను మాట్లాడితే కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు రాకుండా పోతాయంటున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌. మంగళవారమిక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తోన్న ఎన్నికల ర్యాలీలో తాను పాల్గొనకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ పార్టీ తన శాయశక్తుల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అయితే దిగ్విజయ్‌ సింగ్‌ ఈ ప్రచార కార్యక్రమాలకు వేటికి హాజరు కావడం లేదని సమాచారం.

ఈ విషయం గురించి దిగ్విజయ్‌ని ప్రశ్నించగా.. ‘నేను ఏమన్నా మాట్లాడితే అది వివాదాస్పదం అవుతోంది. అందుకే ఎన్నికలు ముగిసే వరకూ నేను ఏం మాట్లకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను మాట్లాడితే దాని వల్ల మా పార్టీకి ఓట్లు పడవు. అందుకే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. ర్యాలీల్లో కూడా పాల్గొనటం లేదు. కానీ నా కార్యకర్తలకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. పార్టీ నిర్ణయమే మనందరికి శిరోధార్యం. మనకు నచ్చని వాళ్లు ఎన్నికల బరిలో ఉన్నప్పటికి కూడా మనం పార్టీని దృష్టిలో పెట్టుకుని వారి కోసం పని చేయాలి. వారిని గెలిపించాలి’ అని కోరారు.

అయితే బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం దిగ్విజయ్‌ సింగ్‌కి ఇష్టం లేదని.. అందువల్లే ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దిగ్విజయ్‌ కూడా కాంగ్రెస్‌, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడాన్ని బహిరంగంగానే విమర్శించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు