‘ఆయన’ తిరిగొచ్చారు

16 Apr, 2018 17:38 IST|Sakshi

భోపాల్‌ : ఆయన తిరిగొచ్చారు. ఆరు నెలల క్రితం ‘నర్మద పాదయాత్ర’ పేరిట ఆయన చేపట్టిన రాజకీయేతర యాత్ర సోమవారం నాడు ముగిసింది. ఆయన తన యాత్రను రాజకీయేతర యాత్రగా అభివర్ణించుకున్నప్పటికీ అందులో రాజకీయం లేకపోలేదు. ప్రజలతో పోయిన సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు, పార్టీలో పోయిన పరువును తిరిగి తెచ్చుకునేందుకు ఆయన ఈ యాత్రను చేపట్టారు. ప్రతిపక్షాలనే కాకుండా స్వపక్షాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఇబ్బందిపెట్టే తత్వం ఆయనది. అలా అని బోలా మనిషి కాదు. కనిపించని కపట నాయకుడు. దివంగత కాంగ్రెస్‌ నేత అర్జున్‌ సింగ్‌ శిశ్యరికంలో రాజకీయంగా ఎదిగిన వారు. ఆయనే దిగ్విజయ్‌ సింగ్‌.

స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఆరు నెలల తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. ‘నేను ఇదివరకటిలా రాజకీయ కార్యకర్తను కాను. ఇప్పుడు పరిపాలనాదక్షుడిన’ ని మీడియా ముందు చెబుతూ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. తాను పార్టీలో ఏ బాధ్యతలు నిర్వహించాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీయే నిర్ణయిస్తారని లౌక్యం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి పదవి పట్ల మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా, అది ఇరువైపుల పదునున్న కత్తిలాంటిదని చెప్పారు. ప్రతిపక్షంలో భయం పుట్టించగలదని, స్వపక్షంలో చీలికలకు కారణం కాగలదనే ఉద్దేశంతోనే ఆయన ఇరువైపుల పదునున్న కత్తితో పోల్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో దిగ్విజయ్‌ సింగ్‌తోపాటు కమల్‌ నాథ్‌ బృందం, జ్యోతిరాధిత్య సింధియా బృందం అంటూ మూడు వర్గాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారిని పోటీకి నిలబెట్టరాదని రాహుల్‌ గాంధీ బలంగా భావిస్తున్నందున 71 ఏళ్ల దిగ్విజయ్‌ సింగ్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆయన కమల్‌నాథ్‌ను సమర్థించేందుకు సిద్ధంగా ఉన్నారు. జ్యోతిరాధిత్యను ఆయన మొదటి నుంచి దూరం పెడుతున్నారు.

2003లో దిగ్విజయ్‌ సింగ్‌ స్వరాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేంద్ర పార్టీ కార్యకలాపాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. మొన్నటి వరకు గోవా, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. గోవా ఎన్నికల్లో అధిక సీట్లు వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకరావడంలో దిగ్విజయ్‌ సింగ్‌ విఫలం కావడంతో ఆయన బాధ్యతలను కుదించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయన పాదయాత్ర మొదలు పెట్టారు. ఇప్పుడు దిగ్విజయ్‌ తిరిగి రావడంతో ఆయన గురించి పార్టీ వర్గాల్లో ‘ఆయన తిరిగొచ్చారు’ అని నర్మగర్భంగా కార్యకర్తలు మాట్లాడుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజలు విసిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతం ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితులతో మగ్గుతున్నారు. ఇసుక మాఫియా వ్యవహారాలు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం పరువు తీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దిగ్విజయ్, కమల్‌నాథ్, సింధియాలు ఒక్కటయితే కాంగ్రెస్‌కు విజయం పెద్ద కష్టం కాదు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాకు ధైర్యం చెప్పిన సంగతి మర్చిపోలేను

‘ఒక ధృవతార రాలిపోయింది’

ఆ నంబర్‌తో దురదృష్టం వెంటాడిందా?

ఏడు రోజులు సంతాప దినాలు.. రేపు అంత్యక్రియలు!

‘65ఏళ్ల స్నేహం మాది.. నోట మాట రావడం లేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హిట్‌ డైరెక్టర్‌తో మరోసారి ఎన్టీఆర్‌..!

‘ మా గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటారు’

జాన్వీ పార్టీ డ్రెస్‌ ఖరీదు ఎంతంటే..

యూఎస్‌లో దూసుకెళ్తోన్న ‘గీత గోవిందం’

సైలెంట్‌గా స్టార్ట్‌ చేసిన మెగా హీరో

‘మిత్రోం’ ఇది తగునా..?