నన్ను బెదిరిస్తున్నారు: దినకరన్‌

3 Jan, 2018 10:09 IST|Sakshi

సాక్షి, చెన్నై:  తనను రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఐటీ, సీబీఐ దాడుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఎమ్మెల్యే  టీటీవీ దినకరన్‌ ఆరోపించారు. ఈ బెదిరింపులకు తాను భయ పడనని, త్వరలో అమ్మ జయలలిత ఆశించిన పాలన తమిళనాట రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

కుంభకోణంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో ఓటర్లు తనకు అఖండ మెజారిటీ ఇవ్వడాన్ని రాష్ట్రంలోని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తనకు మద్దతుగా ప్రజానీకం, అన్నాడీఎంకే కేడర్, నేతలు కదులుతున్నారని తెలిపారు. తనను చూసి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

దినకరన్‌ వర్గీయులపై మరో వేటు
ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో దినకరన్‌ గెలుపునకు కృషి చేసి పార్టీ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ వేలూరు, విరుదునగర్, తూత్తుకూడి జిల్లాలకు చెందిన 9 మంది నేతలను అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్‌ ఎడపాడి పళనిస్వామి మంగళవారం బహిష్కరించారు. మరోవైపు దినకరన్‌ నుంచి పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే లక్ష్యంతో నేడు అన్నాడీఎంకే సమావేశం జరగనుంది.

మరిన్ని వార్తలు