దూకుడు పెంచిన దినకరన్‌

18 Mar, 2019 08:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైన అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం దినకరన్‌ దూకుడు పెంచారు. 24 లోక్‌సభ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించారు. గెలుపు తమదేనన్న ధీమాను సైతం వ్యక్తం చేశారు. దివంగత సీఎం, అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ ప్రతినిధిగా అన్నాడీఎంకేను చీల్చడంలో టీటీవీ దినకరన్‌ సఫలీకృతులయ్యారు. అన్నాడీఎంకేను, ఆ పార్టీ చిహ్నం రెండాకులను చేజిక్కించుకునే ప్రయత్నాలు చేసి విఫలమైన దినకరన్‌ అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంతో రాజకీయ పయనాన్ని సాగిస్తున్నారు. అమ్మ ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయంటూ  తొలిసారిగా లోక్‌ సభ  ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు.

అలాగే, తనకు మద్దతుగా నిలిచి అనర్హత వేటు వేయబడ్డ ఎమ్మెల్యేల్ని ఉప ఎన్నికల ద్వారా మళ్లీ గెలిపించుకునేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ, తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్న దినకరన్‌ ఈ ఎన్నికల్ని  ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. కలిసి వచ్చే వాళ్లు లేని దృష్ట్యా, తన బలం ఏమిటో తనకే తెలుసునన్నట్టుగా ఎన్నికల్లో సత్తా చాటేందుకు దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే కన్నా ముందుగా, తన అభ్యర్థులను ప్రకటించారు. 24 లోక్‌సభ స్థానాలకు, 9 అసెంబ్లీ స్థానాలకు తొలి విడతగా అభ్యర్థులను ప్రకటించారు. వీరందరి పేర్లను ప్రకటించడమే కాదు, అన్నాడీఎంకే బలహీన పడిందని, గెలుపు తమదే అన్న ధీమాను దినకరన్‌ వ్యక్తం చేయడం గమనార్హం.

అభ్యర్థులు:
తిరువళ్లూరు–పొన్‌రాజ్, దక్షిణ చెన్నై–మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య, శ్రీపెరంబదూరు–తాంబరం నారాయణన్, కాంచీపురం–ఏ.మునుస్వామి, విల్లుపురం–ఎన్‌.గణపతి, సేలం–ఎస్‌కే సెల్వం, నామక్కల్‌–పీపీ.స్వామినాథన్, ఈరోడ్‌ – కేసీ సెంథిల్‌కుమార్, తిరుప్పూర్‌ –ఎస్‌ఆర్‌ సెల్వం, నీలగిరి–రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామస్వామి, కోయంబత్తూరు ఎన్‌ఆర్‌ అప్పాదురై, పొల్లాచ్చి–ఎస్పీ ముత్తుకుమార్, కరూర్‌– ఎన్‌.తంగవేల్, తిరుచ్చి– మాజీ మేయర్‌ చారుబాల తొండైమాన్, పెరంబలూరు– రాజశేఖరన్, చిదంబరం– ఇలవరసన్, మైలాడుతురై – ఎస్‌.సెంతమిళన్, నాగపట్నం–టి.సెంగుడి, తంజావూరు–మురుగేషన్, శివగంగై–వి.పాండి,  మదురై–డేవిడ్‌ అన్నాదురై, రామనాథపురం–ఆనందన్, తెన్‌కాశి– ఎస్‌.పొన్నుతాయి, తిరునల్వేలి–జ్ఞాన అరుల్‌మణిలు పోటీ చేస్తారని దినకరన్‌ ప్రకటించారు. తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు సీట్లను కేటాయించారు. ఇక, అనర్హత వేటుకు గురైన వారికి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మళ్లీ సీటు అప్పగించారు. పూందమల్లి–ఏలుమలై, పెరంబూరు–వెట్రివేల్, తిరుప్పోరూర్‌–ఎం.కోదండపాణి, గుడియాత్తం–జయంతి పద్మనాభన్, ఆంబూర్‌–ఆర్‌.బాలసుబ్రమణి, హరూర్‌–మురుగన్, మానామదురై–ఎస్‌ మారియప్పన్‌ కెన్నడి, సాత్తూరు–ఎస్‌జి సుబ్రమణియన్, పరమ కుడి–డాక్టర్‌ ఎస్‌.ముత్తయ్య పోటీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు