మళ్లీ కోర్టుకు రెండాకులు

6 Mar, 2019 08:15 IST|Sakshi

సుప్రీంకోర్టుకు దినకరన్‌ అప్పీలు పిటిషన్‌ దాఖలు

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ అప్పీలుకు వెళ్లారు. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అన్నాడీఎంకే విజయ చిహ్నం రెండాకులు. డీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం ఎంజీఆర్‌ అన్నాడీఎంకే ఆవిర్భావం, విజయచిహ్నంగా రెండాకులను పరిచయం చేశారు. నాటి నుంచి రెండాకులు ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఎంజీఆర్‌ మరణం తదుపరి పరిణామాలతో ఈ చిహ్నంకు సమస్య తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో చిహ్నం కష్టాలు ఎక్కువే. ఈ చిహ్నం కోసం పెద్ద సమరమే సాగుతూ వస్తున్నది. తొలుత ఈ చిహ్నం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య సమరం సాగింది.

ఈ ఇద్దరు ఏకం కావడంతో దినకరన్‌ రూపంలో చిహ్నం కష్టాలు తప్పడం లేదు. ఈ చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం దినకరన్‌ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈ చిహ్నం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వెలువడ్డ తీర్పులో రెండాకుల చిహ్నం పళని, పన్నీరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీకే చెందుతుందని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక, చిహ్నం కష్టాలు, సమస్య తీరినట్టేనన్న ఆనందంలో మునిగారు. అయితే, దినకరన్‌ మాత్రం పట్టువదలడం లేదు. ఆ చిహ్నం కైవసం చేసుకునేందుకు మళ్లీ న్యాయ పోరాటం బాటపట్టారు. 

పిటిషన్‌: 
రెండాకుల చిహ్నాన్ని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దినకరన్‌ అప్పీలుకు రెడీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే విధించి, రెండాకుల చిహ్నం విషయంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దినకరన్‌ తరఫున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో మళ్లీ చిహ్నం టెన్షన్‌ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చిహ్నం వ్యవహారంలో కోర్టు ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన పక్షంలో సంక్లిష్ట పరిస్థితులు తప్పదన్న ఆందోళన అన్నాడీఎంకేలో బయలు దేరింది. గత నెల తీర్పు వెలువరించే సమయంలో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ బయలు దేరిన విషయం తెలిసిందే. తాజాగా దినకరన్‌ అప్పీలు రూపంలో ఏదేని కొత్త చిక్కులు వచ్చేనా అన్న ఆందోళన తప్పడం లేదు.

మరిన్ని వార్తలు