మోదీ, జైట్లీ మా నాశనం కోరుకుంటున్నారు : దినకరన్‌

18 Nov, 2017 15:12 IST|Sakshi

సాక్షి, చెన్నై : పోయెస్‌ గార్డెన్‌లో జరుగుతున్న ఐటీ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారంటూ ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఒకానోక దశలో ప్రధాన మోదీ, ఆర్థికశాఖ మంత్రి జైట్లీపై దినకరన్‌ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. 

ట్యుటికోరన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘మోదీ, జైట్లీ మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందులో వారి ఆధీనంలో ఉండే ఐటీ శాఖను మాపై దాడులకు ప్రయోగిస్తున్నారు. కేంద్రం కవ్వింపు చర్యలకు మేం భయపడే ప్రసక్తే లేదు. మేము ఎక్కడికి పారిపోం. చాతనైంది చేసుకోండి అంటూ మండిపడ్డారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చెప్పుకున్న మోదీ.. ఆమె ఆప్పత్రిలో ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా పరామర్శించేందుకు రాలేదని... కానీ, ఇప్పుడు కరుణానిధి ఇంటికి వెళ్లటం ఏంటని? ఆయన ప్రశ్నించారు. అయితే దానిని రాజకీయం చేయటం తమకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. 

అమ్మ గౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తమ పదువులను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారంటూ సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌ పై దినకరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయెస్‌ గార్డెన్‌లో సోదాలు జరుగుతున్నంత సేపు తమ వర్గానికి చెందిన కార్యకర్తలే బయట ఆందోళన చేపట్టారే తప్ప... పళని-పన్నీర్‌ వర్గానికి చెందిన వారు ఒక్కరైనా కనిపించారా? అని ఆయన నిలదీశారు. దీనిని బట్టే వారిద్దరికీ ఆమెపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా భారీ భద్రతా నడుపు జయ నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు.. శశికళ, పూన్‌గంద్రన్‌లు వినియోగించిన గదులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు