యోగిపై చెప్పుల దాడి.. సారీ!

15 Apr, 2018 18:04 IST|Sakshi
యూపీ యోగి ఆదిత్యానాథ్‌... కుడివైపు దినేశ్‌ గుండూరావ్‌

సాక్షి, బెంగళూర్‌ :  ఉన్నావ్‌ రేప్‌ కేసుపై స్పందించే క్రమంలో కర్ణాటక పీసీసీ కార్యాధ్యక్షుడు దినేశ్‌ గుండూరావ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో అడుగుపెడితే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై చెప్పులతో దాడి చేయాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. చివరకు ఆయన క్షమాపణలు చెప్పారు. 

ఈ ఉదయం ఓ జాతీయ మీడియాతో దినేశ్‌ మాట్లాడుతూ.. ‘ఆదిత్యానాథ్‌ భారత రాజకీయాల్లో ఓ మచ్చ. ముఖ్యమంత్రిగా ఆయన అనర్హుడు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే అకృత్యానికి పాల్పడి దొరికిపోయాడు. ప్రభుత్వం పరువుపోయింది. సంస్కారం ఉంటే ఆదిత్యానాథ్‌ తన పదవికి రాజీనామా చేయాలి’ అని ఆయన తెలిపారు. అయితే కొనసాగింపులో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన కర్ణాటకలో అడుగుపెడితే ఆయనను చెప్పులతో కొట్టండి. మన ప్రాంతంలో అతన్ని అడుగు పెట్టనివ్వొద్దని కన్నడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. యోగి.. నువ్వు మా రాష్ట్రానికి ప్రచారానికి రావొద్దు. వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నువ్వు సాధువులా ప్రవర్తించటం లేదు. రోజు రోజుకీ నీ పాపాలు పెరిగిపోతున్నాయి. నువ్వొ మోసగాడివి. దేశ ప్రజలు కూడా అతన్ని యోగి అని సంభోదించకండి. అతన్ని నకిలీ (ధోంగి) అని పిలవండి అంటూ గుండూ రావు వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటు కర్ణాటకలో.. అటు యూపీలో కర్ణాటకలో బీజేపీ నిరసన ప్రదర్శనలకు దిగింది. యోగికి క్షమాపణలు చెప్పాలంటూ సోషల్‌ మీడియాలో కూడా చిన్నపాటి ఉద్యమాన్ని నడిపింది. దీంతో దినేశ్‌ మళ్లీ స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చెస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కర్ణాటక బీజేపీ విభాగం మాత్రం తగ్గలేదు. గుండూ రావ్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ నేత రవికుమార్‌ ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు