బుడగ జంగాలను ఆదుకోవాలి

29 Jul, 2019 11:15 IST|Sakshi

సభలో ప్రభుత్వాన్ని కోరిన సభ్యులు 

సాక్షి, అమరావతి: ఊరూరు తిరుగుతూ సంచార జీవితం గడుపుతున్న బుడగ జంగాలను ఆదుకోవాలని అసెంబ్లీలో పలువురు సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు శ్రీ ఆర్థర్‌ మాట్లాడుతూ.. బుడగ జంగాలకు ఒక కులమంటూ లేదని, దీంతో వారికి కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజుకు కూడా  బుడగ జంగాలు ఊరూరు తిరుగుతూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బుడగ జంగాలను ఆదుకుంటామని చంద్రబాబు సర్కార్‌ మోసం చేసిందని విమర్శించారు. బుడగ జంగాలు తమ పిల్లలను చదివించుకోవాలని, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని ఆరాటపడుతున్నారని, వారికి ఏదో ఒక కులం కల్పించి ఆదుకోవాలని శ్రీ ఆర్థర్‌ కోరారు. 

ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు, ప్రభుత్వ పథకాలను వారు పొందలేకపోతున్నారని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏదో ఒకు కుల గుర్తింపు వారికి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. ఏదైనా కులాన్ని ఎస్సీ, ఎస్టీలలో చేర్చాలనుకున్నప్పుడు సమగ్రంగా విచారణ జరిపి... వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసి రాజ్యాంగంప్రకారం ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకొచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా మెరుగ్గా కులాలను ఎస్సీ, ఎస్టీలలో చేరిస్తే.. రాజ్యాంగ రక్షణ పొందిన ఆ వర్గాలు నష్టపోతాయని అన్నారు. 

దీనికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ సమాధానం ఇస్తూ.. బుడగ జంగాల కులాలకు సంబంధించి ఇది సున్నితమైన సమస్య అని తెలిపారు. వారు ఏ కులంలోనూ లేరని, తమను ఏదో ఒక కులంలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని తెలిపారు. విభజన సమయంలో బుడగ జంగాలు తెలంగాణలో మాత్రమే ఉన్నారని భావించి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్సీల్లోంచి వారిని కేంద్రం తీసేసిందని తెలిపారు. చంద్రబాబు గతంలో ప్రతి కులాన్ని ఎస్సీల్లో చేరుస్తాను? బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి మోసగించారని, ఎన్నికల సమయంలో మాత్రమే ఆ కులాలను మభ్యపెట్టే చర్యలను తీసుకున్నారని మండిపడ్డారు. బుడగ జంగాలకు సంబంధించి ఏదో ఒక కులాన్ని కల్పించే అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రస్తుతానికైతే వారికి ఏ కులం సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు