గులాబీ.. చకోర పక్షులు! 

17 Nov, 2019 09:00 IST|Sakshi

భర్తీ కాని నామినేటెడ్‌ పదవులు

పార్టీ సంస్థాగత పదవులదీ అదే పరిస్థితి    

సాక్షి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌ నాయకుల పరిస్థితి కక్కలేక .. మింగలేక అన్నట్టు తయారైంది. ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులనో, లేక పార్టీ సంస్థాగత పదవులనో అడగలేక, నాయకత్వాన్ని నిలదీయ లేక ఇబ్బంది పడుతున్నారు. వివిధ సందర్భాల్లో ఆయా పదవుల హామీలు పొందిన నాయకులూ అవి అమలు కాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు. ముందు నుంచీ పార్టీలో కొనసాగిన వారు, ఆయా సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి ఎలాంటి పదవుల్లేక రాజకీయ నిరుద్యోగులుగా మారారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. పార్టీ అధినాయకత్వం పదవుల భర్తీపై అంతగా దృష్టి పెట్టకపోవడం, నామినేటెడ్‌ పదవుల పందేరం గురించి ఆలోచించక పోవడంతో తమకు పదవీ యోగం ఎల్లప్పుడు పడుతుందా అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం బహిరంగంగా విమర్శలకు దిగడం లేదు కానీ, తమ ప్రైవేటు చర్చల్లో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక తప్పకుండా తమకు పార్టీ సంస్థాగత పదవులు దక్కుతాయని ఆశించారు. ఇక, ప్రభుత్వం భర్తీ చేయాల్సిన నామినేటెడ్‌ పదవులు ఉండనే ఉన్నాయి. గతంలో పదవులు దక్కిన వారే ఇప్పటికీ కొనసాగుతున్నా.. కొత్తవారికి మాత్రం ఎలాంటి అవకాశమూ దక్కలేదు. 2014లో పార్టీ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు కొందరికి పదవులు సర్దారు. పదవీ కాలపరిమితి పూర్తయిన వారిలో కొందరికి రెన్యువల్‌ చేశారు. దేవాలయ కమిటీలు, మార్కెట్‌ కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లలో సభ్యుల పోస్టులు ఇలా పలు పదవులను భర్తీ చేయాల్సి ఉంది.

ఇదే జరిగితే, తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఎదురుచూస్తున్న వారికి రోజురోజుకూ నిరాశే మిగులుతోంది. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేకపోయిన వారికి నామినేటెడ్, లేదంటే పార్టీ పదవులు ఇస్తామని అపుడు నచ్చజెప్పిన నాయకత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని వాపోతున్నారు. 

పార్టీ పదవులేవీ..?
పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే పార్టీ కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఎక్కడా పోటీ జరిగే అవకాశం ఉండకపోవడం, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నిర్ణయాల ప్రకారమే కమిటీల ఎంపిక జరిగే వీలున్నందున ఒక విధంగా పార్టీ పదవులకూ నామినేటెడ్‌ పద్ధతే అమలవుతోంది. ఈ పరిస్థితుల్లో పార్టీ పదవుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న వారూ ఉన్నారు. అధినాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందకుండా స్థానికంగా ఏ చిన్న పదవినీ ఎమ్మెల్యేలు భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో చివరకు పార్టీ పదవులూ ఖాళీగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం గ్రామ, మండల శాఖ పార్టీ కమిటీల నియామకం మొదలైంది. ఆ తర్వాత  నియోజవర్గ స్థాయి, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

గత ఏడాది మండల కమిటీలకే పరిమితమయ్యారు. నియోజకవర్గ, జిల్లా కమిటీల ఊసే మరిచారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా అన్న మీమాంస శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం పార్టీ నిబంధనావళిలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. ఈ మార్పుల నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పోస్టును రద్దు చేశారు. ఆ స్థానంలో ఇద్దరిని జిల్లా ఇన్‌చార్జులను నియమించాలి. ఈ సవరణ జరిగి ఐదేళ్లు దాటుతున్నా అమల్లోకి మాత్రం రాలేదు.

దీంతో జిల్లాలో పార్టీకి సంస్థాగత సారథి ఎవరూ లేకుండా పోయారు. ఉమ్మడి నల్లగొం డ జిల్లాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన బండా నరేందర్‌రెడ్డి ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ పదవిలో ఉన్నారు. ఆయన స్థానంలో ఎవరినీ కొత్తవారికి నియమించలేదు. నియోజకవర్గ కమిటీలకు ఇన్‌చార్జులను నియమించాలి్సన ఎమ్మెల్యేలు సైతం కమిటీల ఏర్పాటుపై చొరవ తీసుకోవడం లేదు. ఇక,, ప్రభుత్వ నామినేటెడ్‌ పదవుల భర్తీ నిరాశాజనకంగానే ఉంది. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి ఎలాంటి గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ ఉంది. 

‘కొత్త’ ... లొల్లి
పాత, కొత్త నాయకులు, కేడర్‌తో పార్టీ కిక్కిరిసిపోయింది. దీంతో సహజంగానే గ్రూపులు తయారయ్యాయి. ఆయా నాయకులు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంలో వారి వెంట వచ్చిన కేడర్‌ కొంత ఉంది. ఒక విధంగా వీరిలో ముఖ్యులు అనుకున్న వారిని ఏదో ఒక పదవి ఆశచూపెట్టి వెంట తెచ్చుకున్నారు. కానీ, ఇక్కడకు వచ్చాక వారిని పార్టీ పదవుల్లో సర్దడం నాయకుల వల్ల కావడం లేదు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీల వలసవచ్చిన వారు, ముందు నుంచీ పార్టీలో ఉండి పనిచేస్తున్న వారు కలిసి పనిచేయలేకపోతున్నా రు.

ఫలితంగా గుంపు రాజకీయం నడుస్తోంది. ఈ పరిస్థితి నల్లగొండ, నకిరేకల్‌ మిర్యాలగూ డ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. మొత్తంగా జిల్లా టీఆర్‌ఎస్‌ లో ఇప్పుడు పదువుల లొల్లి మొదలైంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అధినాయకత్వం మాత్రం పదవుల పంపకంపై మీనమేషా లు లెక్కిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు