పార్టీ కమిటీలకేదీ మోక్షం?

2 Mar, 2018 03:26 IST|Sakshi

అధికార పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి

మూడేళ్లుగా జిల్లా కమిటీలు ఖాళీ

పొలిట్‌ బ్యూరోదీ అదే పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో సంస్థాగత పదవుల లొల్లి మొదలైంది. పార్టీకి కీలకమైన పొలిట్‌బ్యూరోతో సహా రాష్ట్రస్థాయిలో అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు దాదాపు మూడేళ్లుగా ఖాళీగా ఉండటంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ జిల్లా కమిటీలకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక పాత జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్నవారు నామమాత్రంగా మిగిలిపోయారు.

వారికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లుగా అవకాశం లభించడంతో.. జిల్లా పార్టీని పెద్దగా పట్టించుకోవడంలేదు. మొత్తంగా జిల్లా స్థాయిలో పార్టీ నాయకుల సమస్యలు, ఆధిపత్య పోరు, విభేదాలను పట్టించుకునే యంత్రాంగం లేకుండాపోయిందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యమకాలంలో పనిచేసిన నాయకులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంలో, తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల నాయకులు చాలా నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనితో ఉద్యమకాలంలో పనిచేసిన నాయకులను పట్టించుకునేవారెవరో అర్థంకాక.. త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నామని పార్టీ నేతలు వాపోతున్నారు. ఇతర పార్టీల నుంచి చేరి ఎమ్మెల్యేలుగా గెలిచిన, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంటున్నారు.

మూడేళ్లుగా లేని కమిటీలు
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీకి రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు, అనుబంధ సంఘాల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులే జిల్లా పార్టీకి మార్గనిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్‌ అని సీఎం కేసీఆర్‌ పలుసార్లు స్పష్టం చేశారు. దాంతో నామినేటెడ్‌ పదవుల్లో, ఇతర అంశాల్లో పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనలను మాత్రమే జిల్లా ఇన్‌చార్జి మంత్రులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి నిర్ణయాల్లోనూ, నియామకాల్లోనూ ఎమ్మెల్యేల ప్రతిపాదనలను కాదని నిర్ణయం తీసుకునే పరిస్థితి, ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి జిల్లా మంత్రులకు లేదు. నామినేటెడ్‌ పదవులు, ఇతర పనులు ఆశించే నాయకులపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేకుంటే.. ఆ నాయకులను కాపాడుకునే వ్యవస్థ టీఆర్‌ఎస్‌లో లేకుండా పోయిందని పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మండల, జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పూర్తిచేస్తే పరిస్థితులు వేరుగా ఉండేవని పేర్కొంటున్నాయి.

పార్టీకీ ప్రాధాన్యత ఇవ్వాలి..
పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి, పార్టీ నుంచి కూడా ప్రతిపాదనలను తీసుకుంటే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం దక్కుతుందని స్పష్టం చేస్తున్నాయి. అలా కాకుండా కేవలం ఎమ్మెల్యేలకే సర్వాధికారాలు ఇస్తే.. పార్టీకి కష్టకాలంలో పనిచేసిన వారికి ఇబ్బందులు వస్తున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొంటున్నారు. ఉద్యమకాలంలో పని చేసిన పార్టీ నేతలకు ఆయా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటం, జిల్లా స్థాయిలో మంత్రులు పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచకుండా పోతోందని అంటున్నారు. గతంలో పార్టీ అధినేత కేసీఆర్, ముఖ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత వంటివారికి సమస్యలు చెప్పుకొనే అవకాశం ఉండేదని.. ఇప్పుడు వాళ్లెవరూ అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు