అసమ్మతి తిరుగుబావుటా!

10 Sep, 2018 12:28 IST|Sakshi
కాసాని జ్ఞానేశ్వర్‌, కేపీ వివేకానంద, శంభీపూర్‌ రాజ్‌

టీఆర్‌ఎస్‌లో పెల్లుబికుతున్న ఆవేశాలు

రసవత్తరంగా గ్రూపు రాజకీయాలు

ఎవరికి వారే సమావేశాలు.. చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాలు వచ్చినప్పుడే టీఆర్‌ఎస్‌లో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అయితే, గులాబీ బాస్‌ మాత్రం ఎక్కడిక్కడ తాజా మాజీలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయిస్తూ ప్రకటన జారీ చేశారు. దీంతో గ్రేటర్‌లోని ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి వర్గాలు తిరుగుబావుటా ఎగరేశాయి. మొదటి రెండు రోజుల్లో షాక్‌లో ఉన్న ఆశావహులు, తర్వాత తేరుకుని వేరు కుంపట్లకు రెడీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సైతం గ్రూపులు కట్టారు. తమ నిరసనను బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇంతకాలం అధికారం చెలాయించిన తాజా మాజీలకు వ్యతిరేకంగా సభలు, సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. టికెట్లు ఆశించినవారు సైతం రెబెల్స్‌గా మారారు. దీంతో ఎవరిని బుజ్జగించాలో.. ఇంకెవరి స్థానాలు మార్చాలో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఇదే అదునుగా ఇంతకాలం గుంభనంగా ఉన్నవారు సైతం తమకు ప్రజాబలం ఉందని.. తమకు టికెట్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు సైతం తమ వెంట వస్తారని కాంగ్రెస్, టీడీపీ అధినేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో గ్రేటర్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఆ ముగ్గురు ఎటు వైపు..?
కుత్బుల్లాపూర్‌: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టాయి. కుత్బుల్లాపూర్‌లో ఇప్పటి దాకా తెర చాటుగా ఉన్న గ్రూపు రాజకీయాలు బహిరంగ సమరానికి సై అంటున్నాయి. ఇక్కడి నుంచి తనకు టికెట్‌ ఇస్తే తన వెంట ముగ్గురు కార్పొరేటర్లు వస్తారని మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలిసి విన్నవించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కుత్బుల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న పై ముగ్గురు జ్ఞానేశ్వర్‌ వెంట నడుస్తారా.. లేక పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం పనిచేస్తామని, ఏ ఒక్కరూ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు.  

సిట్టింగ్‌కు కార్పొరేటర్ల మధ్య దూరం..
తాజా మాజీ ఎమ్మెల్యేగా వివేకానంద్‌కు సీటు కేటాయించడంతో కార్పొరేటర్లు కనీసం వివేకానంద్‌ను కలిసేందుకు కూడా ప్రయత్నించకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం ప్రకటన వెలవడగానే కేవలం రెండు, మూడు డివిజన్ల కార్యకర్తలు, కార్పొరేటర్లు మాత్రమే హంగామా చేశారు. తిరుగుబావుటా ఎగురవేసిన కార్పొరేటర్లు మాత్రం వివేకానంద్‌ను కలవకుండానే వేరు కుంపటి పెట్టడం చర్చానీయాంశమైంది. ఇంతలోనే కాసాని విషయం వెలుగులోకి రావడంతో టీఆర్‌ఎస్‌లో మరింత ఆందోళన మొదలైంది. ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సైతం ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నట్లు ఆయన వర్గీయులు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే సీఎం చెప్పిన విధంగానే సిట్టింగ్‌లకు అవకాశం ఇవ్వడంతో అటు కార్పొరేటర్లు, ఇటు గ్రామాల సర్పంచ్‌లు గ్రూపులు కట్టారు.    

శంభీపూర్‌కు టికెట్‌ ఇవ్వాలని తీర్మానం
కుత్బుల్లాపూర్‌: ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రి కేటీఆర్‌ను కోరాలని కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని ఓ రహస్య ప్రాంతంలో సమావేశమైన వీరంతా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజును నిలదీశారు. టికెట్‌ నీకేనని తామంతా ప్రచారం చేశామని, తీరా ఫలితం తారుమారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, రావుల శేషగిరి, విజయ్‌శేఖర్‌గౌడ్‌తో పాటు జడ్పీ వైస్‌ చైర్మన్‌ బొంగునూరి ప్రభాకర్‌రెడ్డి, పలువురు సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొని తమకు కేటీఆర్‌ను కలిసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విషయంపై తమ అభిప్రాయాన్ని ఆయనకు చెబుతామన్నారు. అయితే, పార్టీ నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్ట వద్దని, అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని రాజు చెప్పగా.. పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఈ రహస్య సమావేశం మరింత హాట్‌టాపిక్‌గా మారింది.  

ఎల్బీనగర్‌కు అసమ్మతి సెగలు
అధికార టీఆర్‌ఎస్‌లో ‘ముందస్తు’ అభ్యర్థుల ప్రకటన అసమ్మతి నగరమంతటా విస్తరిస్తోంది. ఆదివారం ఎల్బీనగర్‌లో అభ్యర్థితో నిర్వహించిన కార్పొరేటర్ల సమావేశానికి ఏడుగురు కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, జూబ్లీహిల్స్,రాజేంద్రనగర్‌లలో కార్పొరేటర్లే కేంద్రంగా అసమ్మతి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఉప్పల్‌ అభ్యర్థి భేతి సుభాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా మేయర్‌ రాంమోహన్‌ పావులు కదుపుతున్నారు. ఇక అభ్యర్థులు ప్రకటించని ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

సందిగ్దంలో దానం నాగేందర్‌
ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ను గోషామహల్‌ నుండి పోటీ చేయాల్సిందేనని పార్టీ ముఖ్యనేత హుకుం జారీ చేయడంతో ఆయన ఒకటి రెండు రోజుల్లో అక్కడ ప్రచారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఖైరతాబాద్‌లో కార్పొరేటర్‌ విజయారెడ్డి – మన్నె గోవర్ధన్‌రెడ్డిలలో ఒకరికి టికెట్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి టికెట్‌ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోని బృందం నాయినిని కలిసి శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా అర్హుడని ఆయనకే టికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజులుగా సీఎంను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు.

గోషామహల్‌లో ముస్లిమేతరులను అంగీకరించం
బంజారాహిల్స్‌: ముస్లింలకు కనీసం పది సీట్లు కేటాయించాలని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత సయ్యద్‌ సాజిద్‌ అలీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రకటించిన 105 స్థానాల్లో ముస్లింలకు కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయించారని ఇది అన్యాయమన్నారు. గోషామహల్‌లో పోటీ చేసేందుకు దానం నాగేందర్‌ను బతిమిలాడుతున్నారని, ముఖేష్‌గౌడ్‌ చుట్టూ తిరుగుతున్నారని అయితే, ఇక్కడున్న ముస్లిం నేతలను వదిలేసి ఇతరులను బతిమిలాడాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో 90 వేల మంది ముస్లింలు ఉన్నారని, తనకు అవకాశమిస్తే గెలిచి చూపిస్తానన్నారు. ఎవరినో తీసుకొచ్చి తమపై రుద్దితే సహించమని హెచ్చరించారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు.    
 
‘బొంతు’కు టికెట్‌ ఇవ్వాలంటూ ఆందోళన
బంజారాహిల్స్‌: గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు ఉప్పల్‌ అసెంబ్లీ స్థానానికి టిక్కెట్‌ ఇవ్వాలంటూ కుషాయిగూడ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఆదివారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 3లోని బొంతు నివాసం ముందు బైఠాయించారు. ఇప్పటికైనా కేసీఆర్‌ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఉప్పల్‌ను రామ్మోహన్‌కు ఇవ్వకపోతే స్థానిక మహిళలెవరూ టీఆర్‌ఎస్‌ కోసం పనిచేయరని హెచ్చరించారు. అయితే, ఆందోళనచేస్తున్న సమయంలో మేయర్‌ తన ఇంట్లో లేరు. 

మరిన్ని వార్తలు